కృష్ణా నది యాజమాన్య బోర్డుకు (KRMB) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఈనెల 9న తలపెట్టిన త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసిన నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్.. ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ అంశాలను అజెండాలో చేర్చాలని.. నీటి పంపకాలు సమీక్షించాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు రాసిన లేఖలో రజత్‌కుమార్ ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న రాయలసీమ, ఆర్డీఎస్ కుడికాల్వ పనులను ఆపాలని.. పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ వెలుపలకు నీరు తరలించకుండా చూడాలని కోరారు. పోలవరానికి సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చినందున కృష్ణా జలాల్లో తెలంగాణకు అదనంగా 45 టీఎంసీలు ఇవ్వాలని.. తాగునీటి జలాలను 20 శాతంగానే లెక్కించాలని బోర్డుకు రాసిన లేఖలో వివరించారు.
తెలంగాణ కేటాయింపుల్లో మిగులు నీటిని లెక్కించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని.. విద్యుత్ ఉత్పత్తి ఆపాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కృష్ణానది యాజమాన్య బోర్డుకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
ఇదివరకే లేఖ...
తెలంగాణ ప్రభుత్వం తన హక్కుగా వచ్చిన నీటితోనే చట్టం, ట్రైబ్యునల్ ఆదేశాలకు లోబడి శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని... ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఓ అభిప్రాయానికి రావాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఇదివరకే కోరింది. ఈ మేరకు బోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు.
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ఆపాలన్న బోర్డు లేఖకు స్పందనగా లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రధానంగా జలవిద్యుత్ ప్రాజెక్టు అని, కృష్ణా జలాల మొదటి ట్రైబ్యునల్ ప్రకారం.. శ్రీశైలం జలాలను బేసిన్ వెలుపలకు తరలించే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు లేదని అందులో పేర్కొన్నారు. 1990-91 నుంచి 2019-20 వరకు ఏప్రిల్, మే నెలల్లో ఏనాడూ శ్రీశైలంలో 834 అడుగుల పైన నీటి మట్టం ఉండేలా ఏపీ చూడలేదని... ఇప్పుడు మాత్రం బేసిన్ వెలుపలకు నీటిని తరలించాలని 854 అడుగుల పైన నీటి మట్టం ఉండాలని అంటోందని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా అవసరాల కోసం 760 అడుగుల వరకు కూడా నీటిని వదిలేలా 2013లో ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసిందని గుర్తు చేశారు.
ఇదీ చూడండి:
ఏపీకి అన్యాయం జరుగుతోంది.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు సీఎం జగన్ లేఖ