Andhra Unemployees JAC: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి వెంటనే నెరవేర్చాలని ఆంధ్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ అశోక్ నగర్ లో నిరసన వ్యక్తం చేశారు. భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ యువత పాల్గొన్నారు. నిరుద్యోగుల ఆగ్రహానికి జగన్ గురి కాకుండా త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
కేవలం అధికారం కోసం ఆశలు కల్పించిన జగన్మోహన్ రెడ్డికి.. రాజధాని లేని రాష్ట్రంలో పేదలు, రైతు బిడ్డలు, నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులు అర్థంకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న హావిు ఏమైందని ప్రశ్నించారు.సచివాలయ ఉద్యోగులను నట్టేట ముంచేశారని ఆరోపించారు.పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ , గ్రూప్ 1,2,3 ఉద్యోగాల ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని కోరారు. గ్రూపు4 నోటిఫికేషన్ ఇచ్చి నాలుగు నెలలు కావస్తున్నా.. పరీక్షల తేదీలను ఇంతవరకూ ఎందుకు ప్రకటించలేదని దుయ్యబట్టారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.సీఎం జగన్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట... అధికారంలోకి వచ్చాక ఒక మాట.. మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో నిరుద్యోగులు అందర్నీ కలుపుకొని భాజపా రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కూకట్ల నాగేశ్వరరావు, భాజపా సీనియర్ నాయకుడు తోగుంట శ్రీనివాస్ చౌదరి, జెఎసి నాయకులు సిద్దిక్, నవీన్ , రాజశేఖరరెడ్డి , శివ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :