అక్కడక్కడా ఘర్షణలు, కొట్లాటలు, దాడులు.. అధికార, విపక్ష శ్రేణుల వాదోపవాదాలు, తోపులాటల మధ్య రాష్ట్రంలో పురపాలక ఎన్నికల పోలింగు ప్రక్రియ పూర్తయింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో 62.28 శాతం ఓటింగ్ నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో గరిష్ఠంగా 75.93%, కర్నూలు జిల్లాలో కనిష్ఠంగా 55.87% పోలింగు నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
పోలింగు శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక ఏర్పాట్లు చేసినా డివిజన్లు, వార్డుల పునర్విభజనతో ఎవరి ఓట్లు ఎక్కడున్నాయో తెలియక చాలాచోట్ల గందరగోళం నెలకొంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన కొందరు.. తమ ఓటు అక్కడ లేక చాలామంది వెనుదిరిగారు. ఓటరు చిట్టీల పంపిణీ సరిగా జరక్కపోవడంతో చాలామంది ఇళ్ల నుంచి బయటకే రాలేదు.
పలుచోట్ల ప్రతిపక్షాల నిరసనలు..
వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు పలుచోట్ల నిరసనలు తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థుల్ని పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తూ తమను మాత్రం అధికారులు అడ్డుకుంటున్నారని ఆందోళనలకు దిగారు. పోలీసులే వైకాపా అభ్యర్థులకు కొమ్ముకాస్తున్నారంటూ మరికొన్ని చోట్ల వివాదాలు చెలరేగాయి. గుంటూరులో వైకాపా నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి బ్యాలెట్ బాక్సులు నేలకేసి కొట్టేందుకే ప్రయత్నించారంటూ తెదేపా పోలింగ్ ఏజెంట్లు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. వేణుగోపాలరెడ్డి వాహనంపై కొంతమంది రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టడంతో తీవ్రఉద్రిక్తత నెలకొంది.
మాజీ ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం..
సత్తెనపల్లిలో వైకాపా కార్యకర్తలు తెదేపా మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కారు అద్దాలు పగలగొట్టి, కార్యకర్తలపై దాడికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖపట్నం 21వ డివిజన్ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో అధికారులే ఓటర్ల తరఫున ఓట్లు వేసేస్తున్నారంటూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు ప్రణవ్ గోపాల్ ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేయడంతో తెదేపా శ్రేణులు భగ్గుమన్నాయి.
అనంతపురంలో..
అనంతపురం 25వ డివిజన్‌లో పోలింగ్ కేంద్రం వద్ద గుంపులుగా ఉన్నారంటూ ఆ డివిజన్ భాజపా అభ్యర్థి అశోక్‌రెడ్డి, కార్యకర్తలను డీఎస్పీ లాఠీతో కొట్టడం విమర్శలకు దారితీసింది. పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. గతంలో పురపాలక ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘర్షణలతో పోలిస్తే ఈసారి పోలింగ్ సందర్భంగా అతి తక్కువ ఘటనలు మాత్రమే చోటుచేసుకున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లాల వారీగా పురపాలక సంఘాల్లో పోలింగ్ శాతం ఇలా...
శ్రీకాకుళం | 71.52 |
విజయనగరం | 74.61 |
విశాఖ | 74.63 |
తూర్పుగోదావరి | 75.93 |
పశ్చిమగోదావరి | 71.54 |
కృష్ణా | 75.90 |
గుంటూరు | 69.19 |
ప్రకాశం | 75.46 |
నెల్లూరు | 71.06 |
అనంతపురం | 69.77 |
కర్నూలు | 62.53 |
కడప | 71.67 |
చిత్తూరు | 69.60 |
ఇదీ చదవండి:
'ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తా'