విదేశాల్లో ఉన్నత విద్య కోసం.. కొత్త పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. "జగనన్న విదేశీ విద్యా దీవెన" పేరిట పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్ధుల ఎంపిక కోసం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పని చేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ పథకం కింద.. క్యూఎస్ ర్యాంకింగ్స్ లోని టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థుల ఖర్చును భరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో.. టాప్ 100 ర్యాంక్ లోని యూనివర్సిటీలో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని ప్రకటించింది. 100 నుంచి 200 ర్యాంకింగ్ లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే.. రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ మొత్తం ఫీజును నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో తొలి వాయిదా సొమ్మును.. ల్యాండింగ్ పర్మిట్ లేదా ఐ-94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధిస్తే చెల్లించాలని నిర్ణయించింది. మిగతా మొత్తాన్ని సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాల అనంతరం చెల్లించనున్నట్టు ప్రకటించింది. పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారీగా చెల్లిస్తారు. లేదంటే.. సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపచేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఈ పథకం.. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో లబ్ధిదారుల వయసు 35 ఏళ్లు మించకూడదని ప్రకటించింది. ఇంకా.. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే "జగనన్న విదేశీ విద్యా దీవెన" పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు.. ప్రతిఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే నెలల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది.
ఇవీ చదవండి :