andhra pradesh airports ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు విమానాశ్రయాలు గత మూడేళ్లలో రూ.455 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్లు పార్లమెంటరీ అంచనాల కమిటీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టు అథారిటీ చేతిలో 136 ఎయిర్‌పోర్టులు ఉండగా, అందులో 109 విమానాశ్రయాల నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొంది. అందులో కేవలం 9 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల్లో విశాఖపట్నం గత మూడేళ్లలో 2019-20లో రూ.2.29 కోట్ల లాభం దక్కించుకొంది. మిగిలిన అన్ని విమానాశ్రయాలూ మూడేళ్లలోనూ నష్టాన్నే చవిచూశాయి. దేశ వ్యాప్తంగా కొవిడ్ తర్వాత విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగినా మిగిలిన విమానాశ్రయాలు నష్టాల్లో నడవడం పట్ల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. నష్టాల్లో ఉన్న విమానాశ్రయాలపై దృష్టిసారించి నష్టాలకు గల కారణాలను కనుక్కోవాలని కేంద్ర పౌర విమానయానశాఖ సూచించింది. ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
ప్రారంభంకాని భోగాపురం విమానాశ్రయం
విశాఖపట్నం సమీపంలోని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2016 అక్టోబర్ 7న కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసినట్లు కమిటీ పేర్కొంది. 2019 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ సంస్థకు ఈ ప్రాజెక్టును కేటాయించిందని, 2020 ఏప్రిల్ 14న లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేసిందని వెల్లడించింది. 2020 జూన్ 12న కన్సెషన్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసినట్లు తెలిపింది. 2017 ఆగస్టు 14న పర్యావరణ అనుమతులు మంజూరైనట్లు వెల్లడించింది. కానీ ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు మాత్రం ఇంతవరకూ ప్రారంభంకాలేదని తెలిపింది.
ఇవీ చదవండి: