థైరోనార్మ్.. ఇది అబాట్ సంస్థ ఉత్పత్తి బ్రాండెడ్ పేరు. ఇందులో థైరాక్జిన్ సోడియం ఔషధం ఉంటుంది. ఇది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి బాగా సుపరిచితమైన ఔషధం. థైరోనార్మ్‌ను పోలిన నకిలీ ఔషధం ఇదే పేరుతో బహిరంగ విపణిలో చెలామణి అవుతుండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. బాగా పేరున్న కంపెనీ ఔషధానికి నకిలీని సృష్టించి, బహిరంగ విపణిలోకి వదిలారు. ఇదేమీ తెలియని రోగులు వాటినే వాడుతూ.. జబ్బు తగ్గక ఆందోళనతో వైద్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఈ విషయంపై అనుమానం రావడంతో నమూనాలను సేకరించి, ప్రయోగశాలలో పరీక్షించగా.. అందులో నాణ్యత ప్రమాణాలు అస్సలు లేవని తేటతెల్లమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నకిలీ ఔషధాన్ని విస్తృతంగా విక్రయిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులోనూ వెల్లడైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఔషధ దుకాణాలు, డిస్ట్రిబ్యూటర్లపై ఔషధ నియంత్రణాధికారులు కేసులు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.
థైరాయిడ్ రోగులకు ఇది తప్పనిసరి.. భారతీయుల్లో థైరాయిడ్ సమస్య సర్వసాధారణమైంది. ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలో 4.2 కోట్ల మంది వేర్వేరు థైరాయిడ్ జబ్బులతో బాధపడుతున్నారు. వీరిలో మూడోవంతు బాధితులకు వారి ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలియకపోవడం గమనార్హం. ప్రతి 10 మంది పెద్దవారిలో ఒకరు హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురు మధుమేహుల్లో ఒకరు తమకు తెలియకుండానే ఈ థైరాయిడ్ సంబంధిత సమస్యకు గురవుతున్నారు.
గర్భిణుల్లో తొలి త్రైమాసికం ముగిసే నాటికి 44.3 శాతం మంది హైపో థైరాయిడిజం బారిన పడుతున్నారు. థైరాయిడ్ జబ్బుల్లో 99 శాతం దీర్ఘకాలం మందులు వాడాల్సి వస్తుంది. ఇంత ముఖ్యమైన ఔషధం కావడం మూలంగా నకిలీ ఔషధాలను విపణిలోకి చొప్పించడం సులువైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వెలుగులోకి ఇలా... థైరోనార్మ్‌ను ముఖ్యమైన ఔషధం కావడంతో ప్రతి నెలా బాధితులు కొనుగోలు చేస్తారు. దీంతో నెలకు ఎంత మేరకు అమ్మకాలు జరుగుతాయనే ఒక అంచనా ఉత్పత్తి సంస్థ వద్ద ఉంటుంది. కానీ కొంతకాలంగా తమ థైరాయిడ్ మందు ఉత్పత్తుల అమ్మకాల్లో తగ్గుదల కనిపించడంతో.. అబాట్ కంపెనీ సొంతంగా పరిశీలన జరిపింది. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.
తమ ఉత్పత్తిని పోలిన మరో నకిలీ ఔషధాన్ని అదే పేరుతో కొందరు ఉద్దేశపూర్వకంగా విపణిలో చెలామణి చేస్తున్నట్లు గ్రహించింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు విపణిలో పలు దుకాణాల నుంచి నకిలీ ఔషధాల నమూనాలను సేకరించి, ప్రయోగశాలకు పంపించారు. ఫలితాల్లో ఆ ఔషధాల్లో అసలు మందే లేదని నిర్ధారణ అయింది. దీంతో అధికారులు వీటిని విక్రయిస్తున్న దుకాణదారులు, పంపిణీ సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఈ నకిలీ ఔషధం బెంగళూరు నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు సరఫరా అయినట్లు గుర్తించారు. దీన్ని ఎక్కడ తయారు చేశారు? వెనుక ఎవరున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు నియంత్రణాధికారులు వెల్లడించారు.
ప్రజల్లో అవగాహన అవసరం.. పౌరులు ఔషధాన్ని నిత్యం వాడుతుంటారు కాబట్టి.. మాత్ర పైకవర్ రూపంలో ఏమైనా తేడాలున్నాయా? స్వరూపం, రంగులో మార్పులున్నాయా? పరిమాణం తగ్గిందా, పెరిగిందా? మాత్రలు వాడుతున్నా థైరాయిడ్ నియంత్రణలో ఉండడం లేదా? అన్నది పరిశీలించాలి. అనుమానం వస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి.
ఇవీ చూడండి..