Amaravati lesson removed : శాతవాహన రాజులు... వారికంటే ముందు పాలకులు అమరావతిని కేంద్రంగా చేసుకుని ఏ విధంగా పరిపాలన సాగించారు? ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేసింది?... ఇలా అనేక అంశాలను వివరిస్తూ 10వ తరగతి తెలుగు పుస్తకంలో 2వ పాఠంగా అమరావతిని గత ప్రభుత్వ హయాంలో ముద్రించారు.
ప్రస్తుత ప్రభుత్వం 3 రాజధానులను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు అమరావతి పాఠాన్ని ఈ ఏడాది సిలబస్ నుంచి తొలగించారు. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున విద్యార్థులపై భారం పడకూడదని వివిధ సబ్జెక్టుల్లో కొన్ని పాఠాలను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందే నాటికే పాఠశాలల్లో అమరావతి పాఠాన్ని ఉపాధ్యాయులు బోధించారు. సిలబస్ భారం తగ్గించాలంటే పుస్తకం చివర్లోని పాఠాలను తొలగించే వీలుండగా కావాలనే అమరావతిని తీసివేశారని పలువురు అంటున్నారు. ఈ నెల 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి, వెన్నెల పాఠాలు మినహాయించి మిగిలినవి చదువుకుని పరీక్షలకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీనిపై తుని ఎంఈవో గీతాదేవిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా... కొవిడ్ కారణంగా పాఠశాలల పనిదినాలు తగ్గినందువల్ల ఏయే పాఠ్యాంశాలు బోధించాలి?... వేటిని మినహాయించాలనే అంశంపై ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని, ఆ మేరకే ఉపాధ్యాయులు చెప్పారని తెలిపారు.
ఇదీ చదవండి: Farmers On Affidavit: ప్రభుత్వ 'అఫిడవిట్'పై రాజధాని రైతుల ఆగ్రహం