అమరావతిలోని అసైన్డ్ భూముల్లో అవినీతి జరిగిందని అసత్య ప్రచారం చేస్తూ పాలకులు రాజధానిని తరలించే కుట్ర పన్నుతున్నారని ఆ ప్రాంత రైతులు మండిపడ్డారు. అమరావతిపై కక్ష సాధించేందుకే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో తప్పుడు కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. అమరావతిలో ఒకే సామాజికవర్గం ఉందని ఇన్నాళ్లు ఊదరగొట్టిన వైకాపా నేతలు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడుతున్నారని ప్రశ్నించారు. గతంలో, ఇప్పుడూ అమరావతి అభివృద్ధికి అడ్డుపడుతున్న రామకృష్ణారెడ్డి చరిత్రలో రాజధాని ద్రోహిగా మిగిలిపోతారన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు బుధవారంతో 456వ రోజు కొనసాగాయి.
సీఎం కాన్వాయ్ వెళ్తుండగా నిరసనలు చేస్తున్న అమరావతి రైతులు
సీఎం కాన్వాయ్ వెళ్తుండగా నిరసనలు చేస్తున్న అమరావతి రైతులు
ప్రత్యేక కెమెరాలతో నిఘా
ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళుతున్న సమయంలో కాన్వాయ్ మందడంలో శిబిరం సమీపానికి రాగానే రైతులు, మహిళలు శిబిరం ముందుకు వచ్చి అమరావతి జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు రోడ్డుపైకి రాకుండా పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. దీక్షా శిబిరం నుంచి రైతులు ఎవరూ రాకుండా, వారి కదలికలను అంచనా వేయడానికి మహిళా పోలీసులు చొక్కాకు పెట్టుకున్న ప్రత్యేక కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
పోలీసు చొక్కాకు ఉన్న కెమెరా
