AMMA VODI FUNDS: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ ఏడాది అమ్మఒడి రాని వాళ్లు ఎంతమంది ఉన్నారో.. తమకు వచ్చిందో.. రాలేదో తెలియని అయోయమంలోనూ అంతేమంది ఉన్నారు. తాజాగా వాంబే కాలనీకి చెందిన మహిళ ఉదంతమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. పైగా.. ఆమె అమ్మఒడి ఖాతాకు అటాచ్ చేసిన ఎస్‌బీఐ అకౌంట్ నంబరు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆ డబ్బులు ఎవరి ఖాతాలో పడ్డాయనేది ఎవరూ తేల్చడం లేదు. ఏ ఖాతాలో డబ్బులు పడ్డాయనే వివరాలు సైతం స్పష్టంగా అమ్మఒడి వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఎస్‌బీఐకు చెందిన ఆ బ్యాంకు ఖాతాలోని చివరి నాలుగు అంకెలు కనిపిస్తున్నాయి. సచివాలయంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో బ్యాంకుకు వెళ్లి ఆ ఖాతా ఎవరిదని అడిగితే.. తాము ఆ వివరాలు చెప్పడం వీలు కాదన్నారు. బ్యాంకు ఖాతా మొత్తం నంబరు తీసుకురమ్మంటూ బ్యాంకు సిబ్బంది సూచిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆ డబ్బులు ఎవరికి పడ్డాయనే వివరాలనైనా చెప్పాలంటూ ఆ మహిళ గత మూడు వారాలుగా సచివాలయం, బ్యాంకు చుట్టూ తిరుగుతోంది.
ఎన్నో అనుమానాలు: ఈ ఏడాది రెండు జిల్లాల్లోని చాలామందికి వారు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో కాకుండా వేరే దానిలో డబ్బులు పడ్డాయి. అమ్మఒడికి ఒక బ్యాంకు ఖాతాను ఇస్తే.. డబ్బులు మరో బ్యాంకు ఖాతాలో పడ్డాయి. ఈకేవైసీ చేసిన బ్యాంకు ఖాతాలో పడుతున్నాయంటూ సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. కానీ.. ఈకేవైసీ చేసిన ఖాతాకు కూడా పడకుండా తన పాత బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పడ్డాయంటూ చాలామంది చెబుతున్నారు. ఏదో ఒక ఖాతాలో లబ్ధిదారుకు చెందిన వాటిలో పడితే పర్వాలేదు.. కానీ ఇలా ఒకరి పేరుతో డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తే.. అవి వేరొకరికి చెందిన అజ్ఞాత అకౌంట్లలో పడడమే పలు అనుమానాలకు తావిస్తోంది.
విద్యాశాఖ వద్ద సమాచారం లేక: రెండు జిల్లాల్లో ఈ ఏడాది గతంతో పోలిస్తే చాలామంది పేర్లు అమ్మఒడి నుంచి గల్లంతైపోయాయి. తమ పేరు ఎందుకు లేదనే కారణాలు కూడా స్పష్టంగా చెప్పడం లేదని చాలామంది తల్లులు వాపోతున్నారు. గతంలో మాదిరిగా పాఠశాలలకు వెళ్లి అడిగితే.. విద్యార్థుల జాబితాలు తమ వద్దకు రాలేదని, మీరు నివాసం ఉండే ప్రాంతంలోని సచివాలయాలకు వెళ్లమని చెబుతున్నారు. అక్కడికి వెళ్లి అడిగితే.. జాబితాలో మీ పేర్లు లేవంటూ చెబుతున్నారు. సరైన కారణం చెప్పడం లేదు. కనీసం పాఠశాలలకైనా జాబితాలు పంపించి ఉంటే ఈ సందేహాలకు సమాధానం దొరికేది. ఈ ఏడాది అమ్మఒడికి ఎవరు అర్హత సాధించారు, ఎవరు అనర్హులు, ఎందుకు రాలేదు.. అనే వివరాలు.. మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలలకు పంపలేదు. ఇటు పాఠశాల సిబ్బంది సచివాలయానికి వెళ్లమంటే, వాళ్లు స్కూలు వెళ్లమని పంపిస్తున్నారు.
ఇవీ చదవండి: