Amit Shah Hyderabad Tour: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 17న హైదరాబాద్ రానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే హైదరాబాద్ విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం రాత్రి 9.50కి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నేషనల్ పోలీస్ అకాడమీకి వెళతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 17న ఉదయం 8.45కు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే హైదరాబాద్ విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఏడు కేంద్ర బలగాల కవాతు, గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేస్తారు.
కోర్ కమిటీతో భేటీ: 11.10కు బేగంపేటలోని హరిత ప్లాజాకు వెళతారు. అక్కడ భాజపా రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమవుతారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, తెలంగాణ విమోచన వేడుకలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 1.40కి ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లి అక్కడ అధికారిక కార్యక్రమానికి హాజరవుతారు. తిరిగి రాత్రి 7.35కి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీకి పయనమవుతారు.
మహిళామోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ: శనివారం రాష్ట్రవ్యాప్తంగా కూడా భాజపా కార్యక్రమాలు సిద్ధం చేసింది. వేడుకల్లో భాగంగా ఈనెల 17న గ్రామగ్రామన బురుజులపై జాతీయజెండాలని ఎగురువేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. తెలంగాణ విమోచన అమృతమహోత్సవాల్ని పురస్కరించుకొని భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ చేపట్టారు. చార్మినార్ నుంచి పరేడ్‌గ్రౌండ్స్ మీదుగా అసెంబ్లీ వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు యాత్ర సాగనుంది. కిషన్ రెడ్డి ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ర్యాలీలో పాల్గోనున్నారు. అంతకుముందు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద పూజాకార్యక్రమానికి కూడా ఆయన హాజరవుతారు.
ఇవి చదవండి: