విజయవాడలోని స్వరాజ్ మైదానంలో నిర్మించతలపెట్టిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నమూనాను మంత్రుల బృందం ఖరారు చేసింది. మైదానంలో 30 అడుగుల మేర భవనాన్ని (పెద్ద మందిరం తరహాలో ఉంటుంది) కట్టి దానిపై అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తారు. కింద హాలు, విగ్రహం రెండు కలిపి 155 అడుగుల ఎత్తు ఉంటాయి. పార్లమెంటులోని అంబేడ్కర్ విగ్రహాన్ని పోలి ఉండేలా దీన్ని నిర్మించనున్నారు. విగ్రహం కింది భాగంలో నిర్మించే మందిరంలో ఆడిటోరియం, గ్రంథాలయం, బుక్‌ఫెయిర్ నిర్వహించేలా ఏర్పాట్లుంటాయి.
విగ్రహంతోపాటు మిగిలిన ప్రాంతంలో పార్కుతో సహా తుది నమూనాను వచ్చే నెల 2న ఖరారు చేయనున్నారు. స్వరాజ్ మైదానానికి బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదానంగా నామకరణం చేశారు. విగ్రహం, పార్కు పనులను సెప్టెంబరు 15న ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. విగ్రహ నిర్మాణం, పార్కు అభివృద్ధి పనులకు సంబంధించిన బిడ్లను సెప్టెంబరు 1న ఆహ్వానించనున్నారు.