AMARAVATHI FARMERS PADAYATHRA: అమరావతి రైతుల మహాపాదయాత్ర 36వ రోజు...నెల్లూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. ఉదయం వెంగమాంబపురం నుంచి ప్రారంభమైన యాత్ర.. రాత్రికి వెంకటగిరి చేరుకోనుంది. ప్రచారరథంలోని వెంకటేశ్వరస్వామిని రైతు వేషధారణలో అలంకరించి పాదయాత్ర ప్రారంభించారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగానే పాదయాత్ర సాగుతున్నా ప్రభుత్వం అడ్డుకుంటోందని రైతులు, అమరావతి ఐక్య పరిరక్షణ సమితి నేతలు ఆరోపించారు. ఈనెల 17న సభ నిర్వహణకు అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ ఇస్తే అనుమతి ఇవ్వకపోగా ప్రత్యుత్తరం పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.10 లక్షల విరాళం..
ప్రముఖ పారిశ్రామిక వేత్త, సీఐఐ మాజీ అధ్యక్షులు యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్ రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. 10లక్షల రూపాయల విరాళం రైతులకు అందించారు. కుళ్లు రాజకీయాలతో విశాఖలాంటి మహానగరాన్ని ప్రభుత్వం నాశనం చేయవద్దని ఆయన కోరారు.
వరినాట్లు పట్టుకుని స్వాగతం పలికిన రైతులు..
రాజధాని రైతుల మహాపాదయాత్రలో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమయ్యింది. 36 వరోజు వెంగమాంబపురం నుంచి పాదయాత్ర ప్రారంభించిన రైతులకు రోడ్డు పక్కనే ఉన్న పొలంలో వరి నాట్లు నాటుతున్న రైతులు తారసపడ్డారు. పాదయాత్రను చూసిన స్థానిక రైతులు జై అమరావతి అని నినదిస్తూ వరి నార్లు పట్టుకుని స్వాగతం పలికారు. అమరావతి రైతులు కూడా వెంటనే పొలంలోకి దిగి వారితో పోటీగా కొద్దిసేపు వరినాట్లు వేశారు. రాజధానికి భూములు ఇవ్వకముందు వ్యవసాయం చేసిన స్మృతులను గుర్తుచేసుకుంటూ స్థానికులతో కలిసి జై అమరావతి ఆకారంలో వరినాట్లు వేశారు. వ్యవసాయంలో తామూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంగమాంబపురం రైతులు అమరావతి రైతుల వద్ద వాపోయారు.
అంతిమ విజయం రైతులదే: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఏ రూపంలో పెట్టినా అంతిమవిజయం రైతులదే అవుతుందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టంచేశారు. ప్రభుత్వం పెట్టే బుడబుక్కల కేసులకు భయపడి తాము ఉద్యమానికి మద్దతు తెలపకుండా ఉండబోమని తేల్చిచెప్పారు. రాజధాని రైతుల మహాపాదయాత్రలో 36వ రోజు దెందులూరు నుంచి దాదాపు 200మంది రైతులతో కలిసి వచ్చిన చింతమనేని ప్రభాకర్.. జై అమరావతి నినాదాలు చేస్తూ రైతుల వెంట నడిచారు. అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం... రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన వారిపై దృష్టిసారించాలని హితవుపలికారు.
35వ రోజూ ఉద్ధృతంగా..
నెల్లూరు జిల్లాలో రైతు మహా పాదయాత్ర సమరోత్సాహంతో సాగుతోంది. పాదయాత్రలో జై అమరావతి నినాదాలు హోరెత్తుతున్నాయి. 35వ రోజు గూడూరు నియోజకవర్గం పుట్టంరాజు కండ్రిగ నుంచి యాత్ర ప్రారంభించిన అన్నదాతలు.. గొల్లపల్లి, వెంకటరెడ్డి పల్లి, అంబలపూడి, బాలాయపల్లి, యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకోవడంతో నిన్న యాత్ర ముగిసింది. పాదయాత్ర పొడవునా రైతులకు పల్లె ప్రజలు అడుగడుగునా పట్టంకట్టారు.
మండుటెండ ఇబ్బంది పెడుతున్నా.. మహిళలు, అన్నదాతలు చెక్కు చెదరని సంకల్పంతో ముందుకు సాగారు. రాజధాని రైతులు చేసే పాదయాత్ర తమ స్వార్ధం కోసం కాదని.. రాష్ట్రం బాగు కోసమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. పుట్టంరాజు కండ్రిగ గ్రామంలో రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. ఒక రాజధాని ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు.
చెన్నై తెలుగుసంఘం నుంచి వచ్చిన 150 మంది ప్రతినిధులు అన్నదాతలకు సంఘీభావం తెలిపారు. రైతులు, ప్రజలు పడుతున్న కష్టాన్ని చూసి వారికి మద్దతు తెలిపేందుకు వచ్చామని వెల్లడించారు. 35వ రోజు యాత్రకు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. శనివారం బౌన్సర్లపై జరిగిన దాడి, తదితర పరిణామాలతో వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావును బందోబస్తు విధులకు దూరం పెట్టారు.
ఇదీ చదవండి: