Amaravati Maha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్రకు నెల్లూరు జిల్లా నీరాజనాలు పలుకుతోంది. 24వ రోజు సున్నంబట్టి నుంచి రాజుపాలెం వరకు దాదాపు 15కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో మద్దతు వెల్లువెత్తింది. రాజుపాలేనికి చెందిన కొందరు రైతులకు క్షీరాభిషేకం చేశారు. పాలతో రైతుల కాళ్లు కడిగారు. మీ వెంట మేముంటామంటూ ఉద్వేగంగా చెప్పగా.. మహిళా రైతులు భావోద్వేగంతో కన్నీరుపెట్టుకున్నారు. ముదివర్తికి చెందిన ఇద్దరు చిన్నారులు మన్హా, మహీర్..పాదయాత్రలో తమతో కలిసి నడవడంపై రాజధాని రైతు కోటేశ్వరరావు చలించారు. స్థానికుల దగ్గర నుంచి పాలు తీసుకుని.. ఆ చిన్నారుల కాళ్లకు అభిషేకం చేశారు. ఎంతమంది మనసుమారినా ప్రభుత్వం మారడం లేదని రైతులు అన్నారు.
‘నాది నెల్లూరు జిల్లా నా రాజధాని అమరావతి’అంటూ కొందరు నినాదాలు చేస్తూ రైతులకు కొత్త ఉత్సాహంఇచ్చారు. రైతుల పాదయాత్ర(Amaravati farmers padayatra news) సాగిన ప్రతి గ్రామంలోనూ స్థానికులు.. వివిధ రూపాల్లో మద్దతు తెలిపారు. రాచర్లపాడు, రేగడిచెలిక గ్రామాల్లో మహిళలు హారతులుపట్టారు. చంద్రశేఖరపురంలో పూలతో స్వాగత రంగవల్లులు వేశారు. ప్రవాసులు సైతం.. రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. రాత్రి రైతులు బసచేసిన రాజుపాలెంలో గ్రామస్థులు ఎదురేగి... మేళతాళాలు, డప్పుల మోతలు, కోలాట నృత్యాలతో స్వాగతం పలికారు. ఇవాళ పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు(today break for padayatra) ఐకాస ప్రకటించింది.
దారి పొడవునా జేజేలు..
పాదయాత్ర చేస్తున్న వారికి దారి మధ్యలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దారి పొడవునా ఫలహారాలు అందజేశారు. నెల్లూరుకు చెందిన బోయపాటి ఫుడ్స్ వారు రాచర్లపాడు దగర ఉండి.. యాత్రలో పాలొన్న రైతులతో పాటు మద్ధతు తెలిపేందుకు వచ్చిన వారందరికీ స్వీట్లు, హాటు ప్యాకెట్లు ఇచ్చారు. నరసరావుపేటకు చెందిన డాక్టర్ అరవింద్‌బాబు ఆధ్వర్యంలో అల్పాహారం ఇచ్చారు. బీద రవిచంద్ర ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికిల్ కిట్లు అందజేశారు. వీరితో పాటు స్థానికులు అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. అమరావతి జేఏసీ ప్రతినిధులు మంచినీళ్లను ఇచ్చారు. రాచర్లపాడు, రేగడిచెలిక, పెయ్యలపాళెం, చంద్రశేఖరపురం, పైడేరు, కమ్మపాళెం, బొడ్డువారిపాళెం, నాయుడుపాళెం, గండవరం రోడ్డు మీదగా రాజుపాళెం వరకు 15కి.మీల వరకు యాత్ర సాగింది.
ప్రవాసాంధ్రుల మద్ధతు..
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జి.కోటేశ్వరరావు, న్యాయవాది చెరుకూరి శ్రీధర్, నరసరావుపేటకు చెందిన డాక్టర్ అరవింద్‌బాబు, విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొని తమ మద్ధతు తెలిపారు. రైతులతో కలసి పాదయాత్రలో అడుగులు వేశారు. అమెరికా, సింగపూర్‌లకు చెందిన పలువురు ప్రవాసాంధ్రులు రైతులకు మద్ధతు తెలిపారు.
ప్రజల మద్ధతు చూసి ప్రభుత్వం భయపడుతోంది..
రాష్ట్ర భవిష్యత్తు కోసం పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావం(Amaravati farmers fire on ycp govt) తెలిపేందుకు వస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ప్రజా సంఘాలు తప్పుబట్టాయి. రైతుల పాదయాత్రకు ప్రజల మద్ధతు చూసి ప్రభుత్వం భయపడుతోందని.. అందుకే కుట్రపూరిత పనులతో ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రైతులకు వసతి ఏర్పాట్లు చేసే వారిని బెదిరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా కక్షసాధింపు విధానాలు మానుకోవాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు హెచ్చరించాయి.
ఇదీ చదవండి.. : నర్సీపట్నంలో ఉద్రిక్తత.. రోడ్డుపై అయ్యన్నపాత్రుడు ధర్నా