అమరావతిని కాపాడుకోవడం కోసం రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం 299వ రోజు ఉద్ధృతంగా జరిగింది. ఉద్యమం ప్రారంభించి 300వ రోజుకు చేరుకుంటున్న సమయంలో ఆదివారం రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. తుళ్లూరు నుంచి రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి మీదుగా మందడం వరకు 9 కిలోమీటర్లు మేర నిర్వహించిన పాదయాత్ర.... అమరావతి ప్రాంత ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపింది. రైతుల ర్యాలీకి వామపక్షాలు, తెలుగుదేశం పార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. వీధులన్నీ పచ్చ జెండాలతో నిండిపోయాయి. అమరావతి నినాదాలతో గ్రామాలు మోర్మోగాయి. అడుగడుగునా కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఉద్యమ నినాదాన్ని బలంగా చాటారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని రాజధాని గ్రామాల రైతులు తుళ్లూరుకు చేరుకొని అక్కడ్నుంచి రాయపూడి, వెలగపూడి, మందడం వరకు భారీ పాదయాత్ర చేశారు. దారి పొడవునా జై అమరావతి... సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర స్ఫూర్తితో తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని రైతులు స్పష్టం చేశారు.
అమరావతి ఆకాంక్ష రెట్టింపు
రైతులకు సంంఘీభావంగా తొలినుంచీ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న మహిళలు..... తమను పెయిడ్ ఆర్టిస్టులన్న వైకాపా నేతలకు గట్టిగా బుద్ది చెబుతామని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల తాము కోసం పోరాడుతుంటే వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ఈ ర్యాలీతో తమలో ఇంకా ఉద్యమ ఆకాంక్ష రెట్టింపైందని చెప్పారు. అమరావతి సాధించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని మహిళలు తేల్చిచెప్పారు..
విపక్షాల మద్దతు
రైతులు, మహిళల ఉద్యమానికి వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ నేతలు, కాంగ్రెస్, దళిత బహుజన ఐకాస నేతలు మద్దతు ప్రకటించారు. రైతులు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. 9కిలోమీటర్లు రైతులతో కలిసి ఉద్యమ నినాదాల్లో పాలుపంచుకున్నారు. రైతులు చేసే ఎలాంటి ఉద్యమానికైనా తమ మద్దతు ఉంటుందన్నారు. రైతులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటామని స్పష్టం చేశారు. అమరావతి సాధన కోసం ఎన్నిరోజులైనా...ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు, మహిళలు తేల్చిచెప్పారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.