రాజధాని అమరావతి మార్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచించాలని... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. రాజధాని మార్పునకు సంబంధించి కేంద్రానికి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. కేంద్రానికి లిఖితపూర్వకంగా సమాచారం వచ్చాక ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆయన తెలిపారు.
అమరావతి రైతులు, రాజధాని ఐకాస నేతలు దిల్లీలో కిషన్‌రెడ్డిని కలిసి రాజధాని తరలింపు వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమైనప్పటికీ కొన్ని సూచనలు చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. రైతుల గురించి ఆలోచించాలని ఏపీ ప్రభుత్వానికి చెబుతామన్న ఆయన... ఒక్క రాజధాని మార్పుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరగదన్నారు. భాజపా ఆంధ్రప్రదేశ్ శాఖ 3 రాజధానులు వద్దని ఇప్పటికే తీర్మానం చేసిందన్న కిషన్‌రెడ్డి.. పార్టీ వైఖరి మారబోదని స్పష్టం చేశారు.