అమరావతి ఉద్యమం మరో కీలక ఘట్టానికి చేరింది. నిర్విరామంగా పోరు సాగిస్తున్న రైతులు ఉద్యమం (Amaravathi Farmers Protest) 700వ రోజూ ఉద్ధృతంగా సాగింది. తమ పోరాటంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర (Amaravathi Farmers Maha Padayatra) చేస్తున్న రైతులు..16వ రోజూ తరగని ఉత్సాహంతో కదం తొక్కారు. ముందుగా ప్రకాశం జిల్లా విక్కిరాలపేటలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అమరావతి తరలిపోతుందనే ఆందోళనతో అసువులు బాసిన రైతులకు అనంతర నివాళులర్పించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ పోరాటం సాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అడుగడుగునా జన నీరాజనం
పాదయాత్రలో 16వ రోజు విక్కిరాల పేట నుంచి అడుగు ముందుకేసిన రైతులకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. వర్షం వచ్చినా లెక్కచేయకుండా.. బురద రోడ్లను దాటుకుంటూ మహిళలు ముందుకు కదిలారు. పాదయాత్ర మార్గమధ్యలో కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. 700 రోజులైనా ప్రభుత్వంలో చలనం రాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకూ వెనక్కి తగ్గేదేలేదన్నారు. పాదయాత్ర సాగుతున్న పరిసర గ్రామాల ప్రజలే కాకుండా రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి జనం తరలివచ్చి రైతులకు మద్దతు ప్రకటిస్తున్నారు. చౌటపాలెం, పలుకూరు గ్రామస్థులు రైతులకు సంఘీభావం తెలిపి.. అన్నదాతలతో పాటు పాదం కదిపారు.
పిల్లల నుంచి పెద్దల వరకు..
విద్యావంతులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రైతుల వద్దకు వచ్చి మద్దతు తెలియజేస్తున్నారు. ఛార్టెడ్ అకౌంటెంట్లు ఐకాసగా ఏర్పడి..పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతుల వద్దకు వచ్చి తమ సంఘీభావం తెలిపారు. తమ వంతు విరాళం రైతులకు అందించారు. ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో సీపీఐ రామకృష్ణ (CPI Ramakrishna) రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. అన్నదాతల వెంట నడిచారు. మహా పాదయాత్రకు పాఠశాల విద్యార్ధులు సైతం మద్దతు పలికారు. కందుకూరు పట్టణంలోకి యాత్ర ప్రవేశించిన సమయంలో స్థానికంగా ఉన్న నాగార్జున పాఠశాల విద్యార్ధులు.. రహదారి పక్కన నిలబడి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని అమరావతితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
రెట్టించిన ఉత్సాహం..
జనం స్పందన చూస్తుంటే తమకు చాలా సంతోషంగా ఉందన్న రైతులు..రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతామన్నారు. ప్రభుత్వం స్పందించకపోయినా న్యాయస్థానం తమ పక్షాన ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 16వ రోజున ప్రకాశం జిల్లా విక్కిరాలపేట నుంచి కందుకూరు వరకూ 10 కిలోమీటర్ల మేర రైతులు తమ యాత్ర సాగించారు. కందుకూరు అశేష జనవాహిని రైతులకు ఘనంగా స్వాగతం పలికింది.
ఇదీ చదవండి
Amaravati Cases: అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని: హైకోర్టు సీజే