AMARAVATI FARMERS MAHAPADAYATRA : దసరా వేళ.. జై అమరావతి నినాదాలతో పశ్చిమ గోదావరి జిల్లా పల్లెలు దద్దరిల్లాయి. పండుగ వేళ కుటుంబసభ్యులకు దూరంగా పోరుయాత్ర సాగిస్తున్న అన్నదాతలకు.. అన్నివర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నకిలీ రైతులం కాదంటూ 101 కలశాలతో ప్రమాణం చేసిన కర్షకులు.. ఎన్ని కష్టాలెదురైనా.. మహాపాదయాత్ర పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఒకవైపు మూడు రాజధానులకు మద్దతుగా మంత్రుల పోటాపోటీ కార్యక్రమాలు. మరోవైపు అడుగడుగునా కవ్వింపు చర్యలు. అయినా చెదరని ఉక్కు సంకల్పంతో అమరావతి రైతులు.. పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. 24వ రోజూ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు నుంచి ప్రారంభమైన యాత్ర.. వెలగపల్లి మీదుగా సరిపల్లి వరకూ సాగింది. పెంటపాడు గ్రామస్థులు.. పూలు చల్లుతూ రైతులకు సాదర స్వాగతం పలికారు.
పరిసర ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన రైతులు, రైతు కూలీలు, ప్రజలు పాదయాత్రలో అన్నదాతలతో కలిసి నడిచారు. కె.పెంటపాడులోని వేణుగోపాలస్వామి ఆలయంలో.. మహిళా రైతులు పూజలు చేశారు. నకిలీ రైతులం కాదంటూ 101 కలశాలతో రైతులు, మహిళలు ప్రమాణం చేశారు. రాష్ట్ర సంక్షేమం కోసం భూములిచ్చి.. మూడేళ్లుగా పండుగలను రోడ్ల మీదే జరుపుకుంటున్నామని వాపోయారు.
అనేక అడ్డంకులు, అవరోధాల మధ్య అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నదాతలకు మార్కెట్ కార్మికులు, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. వెలగపల్లిలో భోజన విరామం తీసుకున్న రైతులు..ఆ తరువాత కొనసాగించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అరసవల్లి వరకు.. మహాపాదయాత్ర కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. పెంటపాడు నుంచి 15 కిలోమీటర్ల మేర సాగిన అన్నదాతల యాత్ర.. సరిపల్లిలో ముగిసింది.
ఇవీ చదవండి