19 గ్రామాల కార్పొరేషన్ వెనక గుట్టేంటి..?
Public on ACCMC: రాజధాని పరిధిలోని 19 గ్రామపంచాయతీలతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించటం, గ్రామసభలు నిర్వహిస్తుండటం రైతులను అయోమయానికి గురిచేస్తోంది. సీఆర్డీఏలో పేర్కొన్న 6 గ్రామాలను అమరావతి కార్పొరేషన్ పేరిట ముందుగానే తప్పించటంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామసభల్లో అధికారులు రోజుకో మాట చెబుతుండటం కూడా రైతుల్లో గందరగోళాన్ని పెంచుతోంది.
తీర్మానాలు లేకుండానే.. అధికారుల ప్రకటనలు..
మొదట్లో కేవలం ప్రభుత్వ ఆదేశాల మేరకే సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పిన అధికారులు.. ఆ తర్వాత మంగళగిరి కార్పొరేషన్ విషయంలో కొన్ని గ్రామాల వారు అంగీకరించారని ప్రకటించారు. కానీ.. అందుకు సంబధించిన తీర్మానాలు చూపించమంటే లేవన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కోసమే కార్పొరేషన్ అంటూ గ్రామసభల్లో చెప్పడాన్ని ప్రజలు విశ్వసించడం లేదు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు సమీపిస్తున్నా.. రాజధానిలో ఒక్కపనీ చేయని ప్రభుత్వం.. ఇప్పుడు కొత్తగా రైతులను ఉద్ధరిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.
ముందు ప్లాట్లు అభివృద్ధి చేయాలి..
అమరావతి కోసం భూములు ఇచ్చిన సమయంలో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేశారని.. ఇప్పుడు వాటికి విలువ ఉందా లేదా అని నిలదీస్తున్నారు. అవి అమల్లో ఉంటే సీఆర్డీయే చట్టాన్ని అమలు చేయాలని, రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు రాజధానిలో ప్లాట్లు అభివృద్ధి చేయాలని, అమరావతిని నిర్మించాలని కోరుతున్నారు. వీటన్నింటిపై స్పష్టత లేకుండా గ్రామసభలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
అమరావతి భూముల తాకట్టు కుట్ర..!
19 గ్రామాలతో కూడిన కార్పొరేషన్ ఆలోచన వెనుక గుట్టు విప్పాలని ప్రజలు కోరుతున్నారు. నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసి... దాని ద్వారా అమరావతిలోని భూముల్ని అమ్మడం, భవనాల్ని తాకట్టుపెట్టడం కోసం కుట్రపన్నుతున్నారా అనే అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటి వరకు 13 గ్రామాల్లో నిర్వహించగా.. అన్ని చోట్లా ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. మరో 6 ఊళ్లలో సభలు నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 12వ తేదితో వాటిని ముగించి.. తీర్మానాల నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు.
ఇదీ చదవండి:
Public Opinion on ACCMC: '29 గ్రామాలను కలిపే ఉంచాలి... విడగొడితే ఒప్పుకునేది లేదు'