రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరును అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస తీవ్రంగా ఖండించింది. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో నిరసనలు చేపడతామని తెలిపింది. రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస ఆరోపించింది. వైకాపా నేతలు, మంత్రులు రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడింది. ఉద్యమంలో ఉన్నది పెయిడ్ ఆర్టిస్టులు అంటూ పలువురి వైకాపా ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.
అన్ని రాజకీయ పార్టీలు, కులాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొంటున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ చేస్తోన్న ఆందోళనలు 300వ రోజుకు చేరుకుంటున్నందున.. ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో నిరసనలు చేపడతామని తెలిపింది. 12న అన్ని రెవెన్యూ కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొంది. పోలీసుల నిర్భంధాలకు, అరెస్టులకు వెనుకాడబోమని మహిళా ఐకాస కన్వీనరు సుంకరి పద్మశ్రీ తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యమాలకు కూడా మద్దతిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: