అమరావతి ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు.. ఐకాస(amaravathi jac) నేతలు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని.. హెచ్‌ఎస్‌ఆర్(HRS) కల్యాణ మండపంలో జరుగుతున్న సమావేశానికి అమరావతి ఐకాస నేతలతో పాటు రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి ఉద్యమాన్ని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పాదయాత్రకు సన్నాహాలు
నవంబరు 1వ తేదీ నుంచి పాదయాత్ర నిర్వహించేందుకు.. ఐకాస సన్నాహాలు చేపట్టారు. పాదయాత్రతో పాటు అమరావతి పరిరక్షణకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. రాజధాని కోసం పోరాడుతున్న వారంతా.. ఐకమత్యంతో ఉండాలని రైతు ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ పిలుపునిచ్చారు. కొందరు ఉద్యమానికి నష్టం చేసే దిశలో వ్యవహరిస్తున్నారని.. సమాచార లోపం లేకుండా ఆందరం కలిసి పోరాడదామని ఆయన అన్నారు.
రైతుల పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. రాజధానిగా అమరావతి అవసరంపై ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరిట మహాపాదయాత్ర నిర్వహిస్తామన్నారు. హైకోర్టు నుంచి తిరుమల వరకు 45 రోజులు..పోలీసుల అనుమతి తీసుకుని అమరావతి రైతులు, ప్రజలు పాదయాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు. అమరావతిని నిర్వీర్యం చేస్తే మన బిడ్డల భవిష్యత్తుకు ఉరితాడు అవుతుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఓ వైపు కరోనా నిబంధనలు పాటిస్తూనే.. మరోవైపు రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల మద్దతు తీసుకుని పాదయాత్ర చేపడతామని స్పష్టం చేశారు.
ఉద్యమం తుది ఘట్టానికి చేరుకుంది..
అమరావతి ఉద్యమం తుది ఘట్టానికి చేరుకుందని.. తప్పకుండా విజయం సాధిస్తామని.. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనర్ శివారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు.
అమరావతి పోరాటాన్ని ఉద్ధృతం చేసే క్రమంలో రాజధాని నుంచి తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు.. ఆయన తెలిపారు. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' వరకు జరిగే ఈ మహా పాదయాత్ర అమరావతి సాధనకు విజయయాత్ర కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర పురోభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో ప్రజలకు వివరిస్తామని అన్నారు.
భూముల విలువ పెంచుకోవడం కోసమే
రాష్ట్ర పాలకులకు హైదరాబాద్లో ఉన్న భూముల విలువ పెంచుకోవడం కోసమే.. అమరావతిని చంపుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి కో-కన్వీనర్ గద్దె తిరుపతిరావు అన్నారు. ఈ పాదయాత్ర ద్వారా అమరావతిలో రెండేళ్లుగా జరుగుతున్న నిర్భందకాండను రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని అన్నారు.
ఇదీ చదవండి: