Amaravathi Farmers Maha Padayatra in nellore : అమరావతి రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా ప్రజల ఆహ్వానాల మధ్య ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్ర వెళ్తున్న గ్రామాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు. పాదయాత్రికులపై పూలు చల్లుతూ, హారతులు ఇస్తున్నారు. మీకు తోడుగా మేమున్నామంటూ రైతులతో జత కడుతున్నారు. తమవంతు సహకరిస్తామంటూ భరోసా ఇస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో తురిమెర్ల నుంచి ఊటుకూరు, జోగుపల్లి, మొలకలపూండ్ల రోడ్డు మీదుగా సైదాపురం వరకు 33వ రోజు యాత్ర కొనసాగింది.
33వ రోజు యాత్ర సాగిన మార్గంలో రహదారులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ అన్నదాతలు లక్ష్యపెట్టలేదు. మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. వారికి సంఘీభావంగా చిన్నా, పెద్దా, మహిళలు, యువత తరలివచ్చారు. రైతుల మహాపాదయాత్రలో భాజపా, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం పాదయాత్రకు మద్దతు తెలిపారు. అన్నదాతలతో కలిసి నడిచిన భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. సైదాపురంలోనే రాత్రి బస చేసిన రైతులు నేడు 34వ రోజు యాత్రను అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. 11 కిలోమీటర్లు నడిచి పుట్టంరాజువారి కండ్రిగకు చేరుకోనున్నారు.
ఇవీచదవండి.