రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు మరో మూడు నాలుగు రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం తెలిపారు. తొలిసారిగా సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోవడానికి.. మండలిలో ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడమే కారణమన్నారు. శనివారం నాటికి బిల్లుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించే అవకాశం ఉందని- అంతవరకు ఉద్యోగులకు జీతాల చెల్లింపుతోపాటు ఇతర ఆర్థిక బిల్లులకు చెల్లింపు జరగబోవని చెప్పారు. మూడు నెలల క్రితం సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టనందున ఆర్డినెన్స్ ద్వారా ఏప్రిల్, మే, జూన్ నెలల ఖర్చులు చేశామని.. గతనెల 16, 17 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఎంతో ముఖ్యమైన ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించనందునే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు బిల్లు ఆమోదం కాకుండా అడ్డుకున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేక చంద్రబాబు ఈ విధంగా ప్రవర్తించారని ఆరోపించారు.
ఇదీ చదవండి: ఆశలు రేపుతున్న కరోనా వ్యాక్సిన్.. అతి త్వరలో రాబోతోంది..