మూడు రోజుల పాటు నిర్వహించే పబ్లిక్ హెల్త్ ఇన్నోవేషన్స్ (Public Health Innovations) సదస్సు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ప్రారంభమైంది. వైద్య ఖర్చులు తగ్గించేలా కొత్త ఆవిష్కరణలు రావాలని, అప్పుడే సామాన్యులకు ప్రయోజనం చేకూరుతుందని సదస్సులో పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు అవసరమని పేర్కొన్నారు. టీకాలు, సరికొత్త మందుల ద్వారా కొవిడ్ (Covid) మహమ్మారిని కొంత అదుపులోకి తేగలిగామని చెప్పారు. మోనోక్లోకల్ యాంటీబాడీ కాక్‌టైల్ (Monoclonal antibody cocktail) ఔషధం గేమ్‌ఛేంజర్‌గా మారిందన్నారు. ఈ సందర్భంగా ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి (AIG Hospitals Chairman Dr. D.Nageswara reddy ) మాట్లాడుతూ.. అందరికీ ప్రజారోగ్య సేవలు అందుబాటులోకి తేవాలని సూచించారు. రోజూ మరణాలు చూడటం వైద్యులకు సాధారణమే కానీ, కరోనా సమయంలో ఘోరమైన పరిస్థితులు కనిపించాయని చెప్పారు. ఎన్నో కుటుంబాలు నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఎలా ఎదుర్కోవాలో తొలుత తెలియలేదని.. తుపాకులు లేని సైనికుల్లా రంగంలోకి దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అర్థం చేసుకొని, అవగాహన పెంచుకొని తర్వాత ఎంతోమంది ప్రాణాలను కాపాడే స్థితికి చేరామని డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. దాదాపు 30 వేల మంది కరోనా రోగులకు చికిత్స అందించామని చెప్పారు. వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేస్తే.. వచ్చే ఏడాది నుంచి సాధారణ జీవితం గడపవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌తో ముప్పు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇండియా కంట్రీ ఆఫీసర్ డాక్టర్ అంజూశర్మ మాట్లాడుతూ కరోనా కంటే ప్రపంచ వ్యాప్తంగా యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (Anti microbial resistance) ముప్పుగా పరిణమిస్తోందన్నారు. దీనివల్ల సాధారణ వ్యాధులకు కూడా మందులు పనిచేయని స్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాపై తొలుత డబ్ల్యూహెచ్‌వో చేసిన సిఫార్సులు తప్పుగా ఉన్నాయని అంగీకరించారు. ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ బుర్రి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంక్షోభం కొత్త పాఠాలు నేర్పుతుందని అన్నారు. ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ కె. శంకర్ మాట్లాడుతూ కరోనా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేసిందని చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ మూర్తి మాట్లాడుతూ ప్రపంచ అగ్రగణ్యులైన 500 మంది శాస్త్రవేత్తల్లో 2 శాతం మంది భారతీయులు ఉన్నారన్నారు. అందులో 30 మంది వరకు హైదరాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ప్రజారోగ్యానికి భాగ్యనగరం హబ్‌గా మారిందని చెప్పారు.
ఇదీ చదవండి