AICTE Engineering Colleges: దేశవ్యాప్తంగా మరో రెండేళ్ల పాటు కొత్త ఇంజినీరింగ్ కళాశాలల అనుమతులపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిషేధం విధించింది. ఇప్పటికే 2020-21, 2021-22 ఏడాదికి అనుమతులు నిలిపివేసిన ఏఐసీటీఈ తాజాగా 2023-24 వరకు నిషేధాన్ని పొడిగించింది. బీవీఆర్ మోహన్‌రెడ్డి కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
యూజీ, పీజీ కోర్సుల్లో సీట్లు, ప్రవేశాలు, ఉద్యోగాల డేటాను విశ్లేషించిన బీవీఆర్ మోహన్ రెడ్డి కమిటీ..గతేడాది డిసెంబరులో నివేదిక సమర్పించింది. కొత్త అనుమతులకు కొన్ని ప్రత్యేక మినహాయింపులిస్తూ జనవరిలో ఏఐసీటీఈ కార్యనిర్వాహక కమిటీ నివేదికను ఆమోదించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్‌లో మొదటి ఐదేళ్లలో 100 ర్యాంకుల్లోపు, పదేళ్లలో 50లోపు ర్యాంకులు కలిగి, ప్రముఖ విదేశీ విద్యాసంస్థలతో ఒప్పందాలు, కొత్త సాంకేతికత, ఉద్యోగ నైపుణ్యాలు అందించే సంస్థలకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఇంజినీరింగ్ కళాశాలలు లేని జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు, అవసరమైన బడ్జెట్‌ను కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చు. సివిల్, మెకానికల్, త్రిపుల్ ఈ లాంటి కోర్సుల్లో సీట్లను 50 శాతం కంటే తగ్గించకూడదనే నిబంధన పెట్టింది.
ఎంటెక్ కోర్సులపైనా తాత్కాలిక నిషేధం విధించింది. డిప్లొమా కోర్సుల్లో 50 శాతం సీట్లు మాత్రమే నిండుతున్నందున వీటికి కొత్త అనుమతులు నిలిపివేస్తున్నట్లు ఏఐసీటీఈ స్పష్టంచేసింది. డిప్లొమా కోర్సులన్నీ పరిశ్రమలకు సంబంధించినవిగా ఉండాలని సూచించింది. తరగతి గదిలో నేర్చుకునే విద్యకు, పరిశ్రమలకు మధ్య అనుసంధానం ఉండాలని తేల్చిచెప్పింది. 2022-23 విద్యా సంవత్సరానికి సెప్టెంబరు 15 నుంచి సాంకేతిక విద్యా సంస్థలు తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ వెల్లడించింది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ను అక్టోబరు 25లోపు పూర్తి చేయాలంటూ షెడ్యూల్ విడుదల చేసింది.
ఇదీ చదవండి: New Districts: ఈ తేదీల్లోనే కొత్త జిల్లాల నోటిఫికేషన్..!