‘అన్నదాత అప్పుల సాగు’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై వ్యవసాయశాఖ ఇన్‌ఛార్జి కమిషనర్ శేఖర్‌బాబు వివరణ ఇచ్చారు. 2019 జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 850 మంది రైతు ఆత్మహత్యలకు సంబంధించి రూ.59.50 కోట్లు చెల్లించామని తెలిపారు. 2014 నుంచి 2018 వరకు నమోదై తిరస్కరించిన 773 కేసులను పునర్విచారించామన్నారు. వారికి 471 మందికి రూ.5 లక్షల చొప్పున రూ.23.55 కోట్లు సాయంగా అందించామని స్పష్టం చేశారు. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయంగా అందించే రూ.7 లక్షలు కుటుంబ పునరావాసానికే ఇచ్చినట్లు పేర్కొన్నారు.
* లోవరాజు కుటుంబానికి పరిహారం ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా.. అది ఇంకా కుటుంబానికి అందలేదు. పరిహారం మంజూరైన సంగతి కమిషనరేట్ నుంచి చెప్పే వరకు స్థానిక వ్యవసాయ అధికారులకూ తెలియలేదు. ‘అప్పుల భారం భరించలేక నా భర్త లోవరాజు ఏడాదిన్నర కిందట ఆత్మహత్య చేసుకుంటే పరిహారం డబ్బులు బ్యాంకు ఖాతాలో పడినట్లు వ్యవసాయాధికారి మంగళవారమే చెప్పారు. దీన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది’ అని పినపాత్రుని వరలక్ష్మి వివరించారు. ‘లోవరాజు కుటుంబానికి పరిహారమివ్వాలని గతంలోనే ప్రతిపాదనలు పంపించాం. రూ.7 లక్షలు మృతుడి భార్య ఖాతాలో జమయినట్లు కమిషనరేట్ నుంచి మంగళవారం ఫోన్ చేసి చెప్పారు. విషయాన్ని ఆమెకు తెలియజేశాం’ అని వ్యవసాయ అధికారి ఉమాప్రసాద్ చెప్పారు.
* కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పల్దొడ్డిలో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మన్న భార్య పద్మ బ్యాంకు ఖాతాలో ఈ నెల 11న ప్రభుత్వ ఆర్థిక సాయం రూ.6 లక్షలు జమ చేశామని ఆర్డీవో సి.హరిప్రసాద్ తెలిపారు. మంగళవారం లక్ష్మన్న ఇంటికి వచ్చిన ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. భూమిని పద్మ పేరుతో బదలాయించాలని ఆర్‌ఐను ఆదేశించారు.
* పల్నాడు జిల్లా నూజండ్ల మండలం పాత ఉప్పలపాడులో రైతు రమణారెడ్డి ఫిబ్రవరి 27న ఆత్మహత్య చేసుకున్నా పరిహారం అందలేదని భార్య ప్రభావతి, తండ్రి వెంకటేశ్వరరెడ్డి తహసీల్దార్ మధుబాబుకు మంగళవారం వివరించారు. బాధితులు చెప్పిన వివరాలను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
* విజయనగరం జిల్లా జామికి చెందిన రైతు ఎర్నినాయుడు(29) మృతిపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. అధికారులు బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ‘ఎర్నినాయుడు రూ.12 లక్షల అప్పు తీర్చలేక 2021 జనవరి 12న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మండల త్రిసభ్య కమిటీ రూ.10 లక్షల ఆర్థిక సాయం కోసం సిఫారసు చేయగా, ఇప్పటికే రూ.7 లక్షలు అందింది’ అని నివేదిక పంపారు.
ఇవీ చదవండి: