డీఏపీ, పొటాష్ ఎరువుల కొరతపై ఈటీవీ ప్రసారం చేసిన కథనంపై వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ స్పందించారు. రబీ సీజన్లో డీఏపీ, ఎంఓపీ ఎరువులు దొరక్కపోయినా రైతులు కాంప్లెక్సు ఎరువులు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. రబీ సీజన్లో ఎరువుల కొరత లేదని చెబుతూ ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. 2021-22 రబీ సీజన్‌కు రాష్ట్రంలో 23.44 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఏపీలో అవసరమవుతాయని ప్రణాళిక వేసినట్లు ఆయన వివరించారు. అక్టోబరు 1 నుంచి 26 తేదీ నాటి వరకూ 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువును సరఫరా చేశామని తెలిపారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు, సహకార సంఘాల, మార్క్ ఫెడ్ , ఇతర తయారీ దారుల గోదాముల్లో 5.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. 2021-22 రబీ సీజన్ లో ఆర్బీకేల ద్వారా 1.95 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. ఇప్పటి వరకూ 88 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఆర్బీకేల వద్ద గోదాముల్లో నిల్వ ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 25 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల్ని రైతులు కొనుగోలు చేశారని వెల్లడించారు. డీఏపీ, ఎంఓపీ ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. డీఏపీ, ఎఓపీ ఎరువులు అందుబాటులో లేకపోయినా కాంప్లెక్సు ఎరువులు వాడాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: Ministers Fires on Chandrababu: 'తెదేపా ఉనికి కోసమే దిల్లీలో చంద్రబాబు డ్రామాలు'