పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చేస్తున్న ఉద్యమం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. నరసాపురం వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు టీ స్టాల్ లో టీలు అమ్మి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళ కమిషన్ మాజీ సభ్యురాలు, వనితా క్లబ్ జోనల్ ఛైర్ పర్సన్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. చారిత్రిక నేపథ్యం, రెవెన్యూ కేంద్రంగా ఉన్న నరసాపురం జిల్లా రాజధానిగా ప్రకటించక పోవడం దారుణం అన్నారు. వెంటనే నరసాపురం ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
'అంబేడ్కర్ పేరు పెట్టాలి'
నూతన జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ జిల్లా సాధన సమితి విశాఖలో ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల ప్రజలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల నూతన జిల్లాల్లో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే అధిక సంఖ్యాకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారని అంబేద్కర్ జిల్లా సాధన సమితి కన్వీనర్ కొత్తపల్లి వెంకట రమణ అన్నారు. అంతేకాకుండా ఎంతో దూరదృష్టితో రాజ్యాంగాన్ని నిర్మించిన ఆయన రుణం తీర్చుకునేందుకు ప్రభుత్వానికి ఇదొక సదవకాశంగా భావించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
'మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి'
మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మార్కాపురం పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని వివేకానంద విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ కూడలి వద్ద మానవహారం చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్ష మార్కాపురం జిల్లా అని అఖిల పక్ష నాయకులు అన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఆరో రోజు కొనసాగుతున్నాయి.
మార్కాపురాన్ని జిల్లాగా చేయాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేస్తున్న రీలే నిరాహార దీక్ష నేటితో 11వ రోజుకు చేరుకుంది. మాజీ సైనికులు మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. వీరికి జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. తాము జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 200 కోలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని వారు చెప్పారు.
ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదోని జిల్లాగా చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వర రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాల విభజన ప్రజల వినతులు పరిగణనలోకి తీసుకొని అదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టుల పెండింగ్: సోము వీర్రాజు