విజయవాడ నార్త్ తహసీల్దార్ కార్యాలయంలో అనిశా ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. సుమారు 4గంటల పాటు సాగిన సోదాలు నిర్వహించారు. సర్టిఫికెట్లు మంజూరు చేసేందుకు డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీ కార్యాలయానికి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు విజయవాడ్ రేంజ్ ఏఎస్పీ మహేశ్వరరాజు తెలిపారు. కార్యాలయానికి మొత్తంగా మీసేవ ద్వారా 42వేల 416 దరఖాస్తులు చేరగా సరైన వివరణ లేకుండా 9వేల 186 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు తెలిసిందని ఏసీబీ అధికారులు తెలిపారు. మరో 234 దరఖాస్తులు పెండింగ్‌లో ఎందుకు ఉంచారో కార్యాలయ అధికారుల వద్ద సరైన సమాధానం లేదన్నారు.
ఈ తనిఖీల సందర్భంలో కార్యాలయంలో ఏడుగురు ఉద్యోగుల వద్ద నిబంధనల మేరకు ఉండాల్సిన 500 రూపాయల కంటే అదనంగా ఉన్నట్లు గుర్తించామని... వారి వద్ద నుండి 6 వేల 715 రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదే విధంగా కార్యాలయంలో వీఆర్‌ఏగా పని చేస్తున్న నాగరాజు అనే వ్యక్తి గత మూడు వారాల నుంచి విధులకు హాజరు కాకపోవడం... అతని తరపున తండ్రి దుర్గారావు విధులకు హాజరవుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగి జనార్ధనపురం పరుశురాం కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు.
ఇదీ చదవండి