Absence of students: పాఠశాలల్లో రోజువారీ విద్యార్థుల గైర్హాజరు ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ బడులకు వచ్చే వారిలో సరాసరిన 15 నుంచి 29 శాతంగా... అదే ప్రైవేటులో ఇది 8 నుంచి 10 శాతంగా ఉంటోంది. మొత్తంగా చూస్తే సగటున 13 నుంచి 15 శాతం వరకు విద్యార్థులు తరగతులకు రావడం లేదు. పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం.. శనివారం ప్రభుత్వ బడుల్లో సరాసరిన 19 శాతం, ప్రైవేటులో 10 శాతం మంది విద్యార్థులు బడులు మానేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 59 వేల 193 పాఠశాలలు ఉన్నాయి. శనివారం 54 వేల 396 పాఠశాలల్లో హాజరు నమోదైంది. ఈ పాఠశాలల్లో మొత్తం 63 లక్షల 34 వేల 174 మంది విద్యార్థులు ఉండగా... వారిలో 53 లక్షల 68 వేల 535 మంది హాజరయ్యారు. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ పనులు, సీజనల్ వ్యాధుల కారణంగా వారు రావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుత వర్షాల సీజన్‌లో వ్యవసాయ పనుల కోసం.. కొందరు తమ తల్లిదండ్రుల వెంటవెళ్లడం.. ప్రదాన కారణంగా కనపడుతోంది.
కేంద్ర ప్రాజెక్టు అనుమతుల బోర్డు- పీఏబీ నివేదిక ప్రకారం.. ఏడాదిలో సరాసరిన బడి మానేస్తున్న వారు పదోతరగతిలో 31.3 శాతంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల మంది చదువు మధ్యలోనే మానేస్తున్నట్లు.. నివేదిక వెల్లడించింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇలా.. తరగతులకు హాజరుకాకపోవడం వల్ల... సహజంగా విద్యార్థులు అభ్యసనలో వెనకబడతారు. ఆ తర్వాత మధ్యలో బడి మానేసే పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవానికి వారు బడికి రాకపోతే... తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపాలి. వరుసగా రెండు, మూడు రోజులు మానేస్తే వాలంటీరు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలి. ఈ మేరుకు విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్ ఆదేశించినా... క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. 20 శాతం కంటే ఎక్కువ మంది గైర్హాజరయితే... ప్రధానోపాధ్యాయుడిని వివరణ అడుగుతున్నారు. అక్కడితో అది అయిపోతోంది. వాస్తవంగా.. విద్యార్థులు ఎందుకు రావడం లేదన్న కారణాలను తెలుసుకోవడం లేదు. ఈ సమాచారం తెలుసుకుంటే.. గైర్హాజరును చాలా వరకు అరికట్టవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.
ఒక విద్యాసంవత్సరంలో 10 శాతం పాఠశాలల పనిదినాలు లేదా 15 రోజులు ఒక విద్యార్థి బడికి రాకపోతే... దానిని దీర్ఘకాలిక గైర్హాజరుగా పరిగణించాల్సి ఉంటుంది. దీని కారణంగా వారు అభ్యసనంలో వెనకబడిపోతారు. పాఠాలు సరిగా అర్థం కావు. ఫిన్లాండ్ లాంటి దేశాల్లో విద్యార్థుల గైర్హాజరు 2.8 శాతం మాత్రమే ఉంటోంది. మన దగ్గర 10 శాతం బడిమానేసినా పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ఆ తర్వాత పాఠశాలలకు వచ్చినా అలాంటి వారికి.. ప్రత్యేక తరగతులు నిర్వహించడం లేదు.
ఇవీ చదవండి: