ముంబయి కేంద్రంగా కొనసాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ గుట్టును హైదరాబాద్‌లోని రాచకొండ పోలీసులు రట్టు చేశారు. 15లక్షల మంది సభ్యులుగా ఉన్న 'ఫెరారీ లైన్' ఛానెల్ కేంద్రంగా బెట్టింగ్ నడుపుతున్న ముఠా క్రికెట్ సీజన్‌లో ఆసక్తి కలిగిన వారందరికీ ఆన్‌లైన్ లింక్ పంపిస్తూ బెట్టింగ్‌వైపు ఆకర్షించేది. ఆ గ్రూప్‌కు రాష్ట్ర ఆర్గనైజర్‌గా బంటు రాజేశ్ అనే యువకుడిని నియమించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అతను 2015లో ఇంజినీరింగ్‌లో 'త్రిబుల్-ఈ' పూర్తిచేశాడు. అక్కడ నుంచి హైదరాబాద్ మలక్‌పేట్‌కు వచ్చిన బంటు కొన్నిరోజులు ఓ సంస్థలో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశాడు. వచ్చే వేతనం సరిపోకపోవడంతో... ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ పంటర్‌గా మారాడు. బెట్టింగ్‌తో డబ్బు సులభంగా వస్తుండటంతో ముంబయి ఆర్గనైజర్లతో సంబంధాలు పెట్టుకొని క్రమంగా రాష్ట్ర ఏజెంట్‌గా, ఆర్గనైజర్‌గా నియమితులయ్యాడు. రాష్ట్రానికి చెందిన ఎవరు బెట్టింగ్‌లో పాల్గొన్నా.. ఇక్కడ ఏజెంట్‌గా ఉన్న రాజేశ్ ద్వారానే కొనసాగుతుంటాయి. ప్రతి లావాదేవీలో.... 10 శాతం బంటు రాజేశ్‌కు కమిషన్ అందుతూ ఉంటుంది.
సరూర్‌నగర్‌లో ఓ గదిని ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న బంటు రాజేశ్... ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ వస్తున్నాడు. ఐపీఎల్ సందడిలో భాగంగా... రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు రాజేశ్ నివాసంపై దాడులు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుని నుంచి 10లక్షల 16వేలు, 5 మొబైల్ ఫోన్‌లు, 11 డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 4 ప్రైవేటు బ్యాంకుల ఖాతాల్లోని 19లక్షల 89వేలు స్తంభింపజేశారు.
రాజేశ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను పరిశీలించిన పోలీసులు...అతనికి ప్రత్యేకంగా 50 మంది సభ్యులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితున్ని తిరిగి రిమాండ్‌లోకి తీసుకుని... బెట్టింగ్ పూర్తి వ్యవహారంపై విచారణ జరపనున్నారు. బంటుకు అనుబంధంగా ఉన్న 50 మంది సభ్యులు, బెట్టింగ్ రాయుళ్ల వివరాలను బయటికి తీస్తామని పోలీసులు తెలిపారు.