ప్రేమించిన ప్రతి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా అంటే సమాధానం చెప్పడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ప్రేమించిన ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలంటే ఒక్కొక్కరు కనీసం రెండు, మూడు వివాహాలు చేసుకోవాలి. కాని ఓ వ్యక్తి తను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను ఒకే కల్యాణ మండలంలో ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత ఘటన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
ఉట్నూర్ మండలం ఘనపూర్‌కు చెందిన అర్జున్, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ సమయంలోనే తన మేనత్తల కూతుళ్లను ప్రేమించాడు. ఉషారాణిది అదే ఊరు కాగా.. సూర్యకళది శంభుగూడెం. మూడేళ్లుగా ఇద్దరు మరదళ్లను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించాడు అర్జున్.
నెల రోజుల కిందట ఇద్దరినీ ప్రేమించాను, ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని మూడు కుటుంబాల సభ్యులకు తెలిపాడు. వారు గ్రామ పెద్దలు ఆశ్రయించారు. సూర్యకళ, ఉషారాణిని అర్జున్‌కు ఇచ్చి వివాహం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈనెల 14న ఘన్‌పూర్‌లో సూర్యకళ, ఉషారాణిని ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అర్జన్ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి: KTR: ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీతో ఏం లాభం జరిగింది..?