లైసెన్సు లేకుండా చేపల మేత అమ్మినా, ప్రభుత్వ ఆమోదం లేని మేతను పంపిణీ చేసినా, ఇతర రాష్ట్రాల్లో అమ్మకానికి తయారు చేసి రాష్ట్రంలో విక్రయిస్తూ రెండోసారి పట్టుబడినా.. నిల్వలు జప్తు చేయడంతో పాటు రూ.5 లక్షల జరిమానా కట్టించుకుని, జైలుకు పంపుతారు. నాణ్యత లేని ఉత్పత్తిని విక్రయిస్తూ రెండోసారి పట్టుబడితే నిల్వల జప్తుతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఈ మేరకు విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆక్వా ఉత్పత్తుల్లో యాంటీ బయోటిక్స్ అవశేషాలను విశ్లేషించే ఎలీసా టెస్టులకు ఒక్కో దానికి రూ.1,500 చొప్పున ధర నిర్ణయించారు.
ఎల్‌సీ ఎంఎస్‌ఎంఎస్, జీసీ ఎంఎస్‌ఎంఎస్ పరీక్షల ధర గరిష్ఠంగా రూ.7వేల వరకు ఉంది. ఆర్‌టీపీసీఆర్ పరీక్షలకు రూ.800-1,200 వరకు చెల్లించాలి. మూడు నెలలకోసారి ఆక్వా అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించాలి. లైసెన్సు, ధ్రువీకరణ తదితర సేవలకు రుసుములు నిర్ణయించడంతో పాటు ప్రణాళిక, ఆకృతుల రూపకల్పనను కార్యనిర్వాహక కమిటీ చూస్తుంది. సలహాదారులు, నిపుణులు, కన్సల్టెంట్లను నియమిస్తుంది. ఈ కమిటీ సిఫార్సులతోనే అన్ని అంశాలూ ఆక్వా అభివృద్ధి సంస్థ ఆమోదం కోసం ఉంచాలి. ఆక్వాకల్చర్ విధానాలపై సాంకేతిక సలహా కమిటీలను (టీఏసీ) నియమిస్తారు. ఆక్వా ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, లాభదాయకత, ఇతర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా స్థాయిలో అమలు కమిటీల (డీఎల్‌ఐసీ)ను నియమిస్తారు.
ఆక్వాసాగుకు అనుమతుల మంజూరు, వ్యాపార అనుమతులు, క్రమబద్ధీకరణ తదితర విషయాలను జిల్లా కమిటీ చూస్తుంది. తహసీల్దారు అధ్యక్షతన మత్స్య అభివృద్ధి అధికారి కన్వీనర్‌గా ఉండే మండలస్థాయి కమిటీని జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తుంది. సాగుదారులు, హేచరీలు, వ్యాపారం, ల్యాబ్ పరీక్షలు, ధ్రువీకరణ, నీటి పరీక్షలు, దాణా విశ్లేషణ, మైక్రోబయాలజీ తదితర రుసుముల వివరాలు, ఆక్వా సంస్థలు నిర్వహించాల్సిన దస్త్రాలు, అధికారుల విధులు, బాధ్యతలు, తనిఖీ అధికారాలు, ల్యాబ్ పరీక్షలు, అధ్యయనం, విశ్లేషణ వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
వీధి దీపాల సమస్యలపై ఫిర్యాదుకు మెుబైల్ యాప్: మంత్రి పెద్దిరెడ్డి