Ys Vijayamma Emotional Video : కొద్ది రోజులుగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల వాటాల అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే జగన్ ఆస్తుల వివాదంలో తల్లి, చెల్లిపై కోర్టుకెక్కారు. సరస్వతీ పవర్ కంపెనీలోని తమ షేర్లను షర్మిల, విజయమ్మ అక్రమంగా బదిలీ చేసుకున్నారని పేర్కొన్నారు. దీనికి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా సోదరుడు జగన్ తమకు అన్యాయం చేశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు సామాజిక మీడియాలో షర్మిల నా కుమార్తె కాదంటూ పోస్టులు పెట్టడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి పోస్టులు ఎలా పెడతారని విజమయ్మ ప్రశ్నించారు.
ఈ పరిణామాలన్ని జరుగుతున్న క్రమంలో సడెన్గా వైఎస్ విజయమ్మ వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. రాజశేఖర్రెడ్డి బతికి ఉండగా ఆస్తుల పంచలేదని జగన్, షర్మిల తల్లి విజయమ్మ పేర్కొన్నారు. అన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆస్తులు ఇద్దరికీ సమానమనేది నిజమని మనవడు, మనవరాళ్లు నలుగురికీ ఆస్తులు సమానంగా ఉండాలన్న వైఎస్సార్ ఆజ్ఞ అంతే వాస్తవమని వివరించారు. జగన్, షర్మిల పేరిట రాజశేఖర్రెడ్డి కొన్ని ఆస్తులు పెట్టారని, అది పంపకం ముమ్మాటికీ కాదని తెలిపారు. ఒక బిడ్డకు మరో బిడ్డ అన్యాయం చేస్తున్నందునే ఈ వాస్తవాలన్నీ చెప్పాల్సి వచ్చిందని విజయమ్మ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు తాజాగా వైఎస్ విజయమ్మ మంగళవారం నాడు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అయితే ఆ తల్లికి కుమారుడు కాకుండా పోతాడా? కొడుక్కి అమ్మ కాకుండా పోతుందా? ఓ అన్నకు చెల్లి కాకుండా పోతుందా? చెల్లికి అన్న కాకుండా పోతాడా’ అని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. ‘మా పిల్లల్ని చాలా సంస్కారవంతంగా పెంచాం. మమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారతారా? మా కుటుంబంపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం బాధ కలిగిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన నా కారు ప్రమాదానికి నా కుమారుడు జగన్‌కు ముడిపెడుతున్నారు. షర్మిల నా కూతురే కాదంటున్నారు. నా మనవళ్ల దగ్గరకు వెళితే అదో కథ. ఇంతగా వ్యక్తిత్వహననానికి పాల్పడతారా?’ అని విజయమ్మ వ్యాఖ్యానించారు.
బంధువుల ఇళ్లకు వైఎస్ జగన్ - రహస్య మంతనాలు - పులివెందులలో ఏం జరుగుతోంది?