Papaya farmer protest: ఓ బొప్పాయి రైతు యథావిధిగా పండ్లను అమ్ముకునేందుకు టౌన్‌కు బయలుదేరాడు. పట్టణానికి వెళ్లాలంటే ఆ ఊరి మీదుగా ఒకటే బస్సు. ఆ బస్సు కోసం ఎదురుచూశాడు. రాగానే అందులో ఎక్కుదామని చూస్తుంటే.. తనకు ఉచితంగా పండ్లు ఇస్తేనే బస్సు ఎక్కనిస్తానని డ్రైవర్ చెప్పాడు. అందుకు రైతు ఒప్పుకోకపోవడంతో బస్సు ఎక్కనివ్వలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రైతు.. బస్సు తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో అదే చోట పండ్లను రోడ్డుకు అడ్డంగా పెట్టుకుని గంటపాటు నిరసన వ్యక్తం చేశాడు. ఇదంతా ఒక కథ అయితే.. అసలు అదంతా అవాస్తవమని డిపో మేనేజరు కొట్టిపారేశారు.
రైతు వాదనలు
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడు మాన్ దిన్నె నల్లమల అటవీ ప్రాంతం. అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గ్రామానికి వస్తుంది. గ్రామానికి చెందిన రైతు గోపయ్య తను పండించిన బొప్పాయి పండ్లను ప్రతి రోజూ కొల్లాపూర్‌కు తీసుకెళ్లి అమ్ముకునేవాడు. ఈ క్రమంలో రోజువారీగా బొప్పాయి పండ్లను బస్సులో తీసుకువెళ్లేందుకు రోడ్డుపై పెట్టుకోగా ఆర్టీసీ డ్రైవర్ ఉచితంగా పండ్లు అడిగారని గోపయ్య తెలిపాడు. పండ్లు ఇవ్వకపోవడంతో తనను, బొప్పాయి బుట్టలను బస్సులో ఎక్కించుకోకుండా వెళ్లిపోయారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దాని తర్వాత వేరే బస్సులు లేకపోవడంతో తను విక్రయాలు జరుపుకోలేకపోయానని వాపోయాడు. అందుకే కొల్లాపూర్ నుంచి బస్సు గ్రామానికి తిరిగి వచ్చే క్రమంలో రోడ్డుపై బొప్పాయి పండ్లతో బైఠాయించి రైతు నిరసన తెలిపాడు. రోడ్డుకు అడ్డంగా పండ్ల బుట్టలను ఉంచి బస్సు వెళ్లకుండా గంట పాటు నిరసన వ్యక్తం చేశాడు. డ్రైవర్ ఎక్కించుకోకపోవడంతోనే తనకు ఈ పరిస్థితి ఎదురైందని పేర్కొన్నాడు.
డిపో మేనేజర్ స్పందన...
రైతు నిరసనపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో విస్త్రతంగా ప్రచారం జరగ్గా.. విషయం డిపో మేనేజర్ దృష్టికి వెళ్లింది. ఘటనపై స్పందించిన డిపో మేనేజర్ ఆ రైతు ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టి పారేశారు. ఆ రైతు పండ్లు అమ్ముకునేందుకు కొల్లాపూర్‌కు వెళ్లేది నిజమేనని అన్నారు. కానీ ఈ రోజు పండ్ల బుట్టలు బస్సులో వేస్తూ తాను రావడానికి కుదరదని.. కొల్లాపూర్‌లో తనవాళ్లు దించుకుంటారని డ్రైవర్‌తో రైతు చెప్పినట్లు పేర్కొన్నారు. అందుకు సిబ్బంది ఒప్పుకోలేదని.. సామగ్రితో పాటు మనిషి కూడా రావాల్సి ఉంటుందని డ్రైవర్ సమాధానమిచ్చారన్నారు. అవసరమైతే కార్గో ద్వారా రవాణా చేసుకోవాలని సమాధానం చెప్పినట్లు వివరించారు. దీంతో ఆ రైతు ఈ విధమైన కథనాన్ని ప్రచారం చేసినట్లుగా వివరణ ఇచ్చారు. ఉచితంగా బొప్పాయి పండ్లు ఇవ్వలేదని డ్రైవర్ బస్సు ఎక్కించుకోనివ్వలేదనే దాంట్లో నిజం లేదని డిపో మేనేజర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
- — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 29, 2022
">— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 29, 2022
ఇదీ చదవండి: 'ఎస్మా చట్టాలకు భయపడే ప్రసక్తే లేదు... ప్రభుత్వ మెడలు ఎలా వంచాలో మాకు తెలుసు'