పట్టణాల్లో మెరుగైన తాగునీటి సరఫరా కోసం అమృత్లో చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి రూ.791.50 కోట్ల బ్యాంకు రుణాన్ని ప్రభుత్వం సమకూర్చనుంది. పురపాలక, నగరపాలక సంస్థలకు విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధుల నుంచి రుణాన్ని చెల్లించేందుకు బ్యాంకుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. రూ.3,700 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన 170 ప్రాజెక్టుల పనుల పూర్తి చేసేందుకు తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఏడాది గడువు పెంచింది. 2021 మార్చిలోగా వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. 15 పురపాలక, నగరపాలక సంస్థలు తమ వాటా (50 శాతం) నిధులు సమకూర్చడంలో చేసిన జాప్యం పనులపై ప్రభావం చూపుతోంది. వీటిలో చేపట్టిన 39 ప్రాజెక్టుల పనులపై దాదాపు రూ.330 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. గడువులోగా పనులు పూర్తి చేయాలంటే వాటా సమకూర్చని పుర, నగరపాలక సంస్థల తరఫున బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి ప్రభుత్వ హామీ అవసరమన్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలను ఆమోదిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ చదవండి: