- ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు కింద పోలవరానికి ఇప్పటివరకు రూ.8,614 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. విభజన చట్టంపై వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి... నూతన రాజధాని, మౌలికవసతుల అభివృద్ధికి రూ.2,500 కోట్లు, రెవెన్యూ లోటు కింద రూ.3,979 కోట్లు, వెనకబడిన జిల్లాలకు రూ.1400 కోట్లు, రుణాలు, వడ్డీల చెల్లింపునకు రూ.15.18 కోట్లు.. మొత్తం రూ.16,510 కోట్లు అందజేశామని కేంద్రమంత్రి తెలిపారు.
- ఆయిల్, సహజ వాయువు రంగానికి సంబంధించి వైకాపా ఎంపీలు మిథున్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నలకు... ఆంధ్రప్రదేశ్‌లో రూ.38,514 కోట్ల విలువైన 484 ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లిఖితపూర్వకంగా తెలిపారు.
- కేంద్రం ఉక్కు సముదాయాల అభివృద్ధికి సిద్ధం చేసిన ముసాయిదాలోని పూర్వోదయ ఉక్కు సముదాయంలో ఆంధ్రప్రదేశ్ ఉందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. రాష్ట్ర ఎంపీలు వెంకట సత్యవతి, తలారి రంగయ్య, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
- సత్తెనపల్లి, రాజంపల్లిల్లో కేంద్రీయ విద్యాలయాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయని.. రాజంపేట, కాకినాడ, కందుకూరు, నాదెండ్ల మండలం ఇర్లపాడుల్లో ప్రణాళిక దశలో ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
- వలస కార్మికులపై తెలంగాణ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు... లాక్డౌన్ కాలంలో దేశంలో విభిన్న ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 వేల 571 మంది, తెలంగాణకు చెందిన 37 వేల 50 మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి : రఘురామకృష్ణరాజును మేం సస్పెండ్ చేయం : ఎంపీ మిథున్ రెడ్డి