కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. మంగళవారం ఒక్కరోజే హైదరాబాద్‌లో 165 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఎక్కువ మంది బాధితులకు వైరస్ ఎలా సోకిందో తెలియకపోవడం గమనార్హం. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి నుంచి ఏదో ఓ పనిమీద బయట తిరుగుతున్నామని, ఎక్కడ, ఎలా వ్యాపించిందో తేల్చుకోలేక పోతున్నామని బాధితులు చెబుతున్నారు. ప్రధాన నగరంతోపాటు శివారు ల్లోనూ కరోనా కేసులు అంతకంతకు విస్తరిస్తున్నాయి.
- క్వారంటైన్ అవుతున్న కుటుంబాలు
బాలానగర్ హెచ్‌ఏఎల్ పర్చేజ్ విభాగంలో పనిచేస్తూ టౌన్‌షిప్‌లో నివాసముంటున్న ఉద్యోగి (44)కి వైరస్ సోకడంతో అధికారులు అతన్ని గాంధీకి తరలించారు. కుటుంబ సభ్యులు, కలివిడిగా మెలిగిన మరో ఐదుగురిని క్వారంటైన్ చేశారు. పాత బోయినపల్లి బృందావన కాలనీకి చెందిన వ్యక్తి (57)కి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అతన్ని చికిత్సకు తరలించి, ఇంటి సభ్యులను క్వారంటైన్ చేశారు. అలాగే మూసాపేట పరిధిలో 10 కేసులు వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా ఇటీవల కుటుంబంలోని ఓ వ్యక్తి కొవిడ్ బారినపడ్డారు. ఇంటి సభ్యులకు పరీక్షలు చేయగా, మహిళ, ఆమె ఇద్దరు కుమారులకు వైరస్ సోకినట్లు తేలింది.
- అంబర్‌పేటలో ఉద్ధృతి
యాదవబస్తీకి చెందిన 51 ఏళ్ల మహిళ, భరత్ నగర్‌లోని 46 ఏళ్ల వ్యక్తి, మోతీనగర్ పరిధిలోని పాండురంగానగర్‌లో 24, 80 ఏళ్ల వ్యక్తులు, ఇతర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురికి వైరస్ వ్యాపించింది. జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట సర్కిల్‌లో కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. సీఈకాలనీ, పటేల్ నగర్, తురాబ్‌నగర్, గోల్నాక శంకర్‌నగర్, తిరుమలనగర్, హిమాయత్ నగర్, కాచిగూడ కుత్బిగూడ, బర్కత్‌పుర ప్రాంతాల్లో 15 మందికి, మైలార్‌దేవుపల్లి, శాస్త్రిపురం డివిజన్‌లో ఇద్దరికి, కుత్బుల్లాపూర్‌లో ముగ్గురికి, మంగళ్‌హాట్‌లో ఇద్దరికి, గండిపేట మండలం బండ్లగూడజాగీర్ నగరపాలక సంస్థ పరిధిలో కొత్తగా ఇద్దరికి వైరస్ సోకింది.
- 61 శాతం మందికి జాడ తెలియట్లేదు
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరు జోన్లు ఉండగా, పాజిటివ్ కేసుల్లో ఖైరతాబాద్ మొదటి స్థానంలో ఉంది. సోమవారానికి జోన్ పరిధిలోని మెహిదీపట్నం సర్కిల్‌లో 268, కార్వాన్‌లో 392, గోషామహల్‌లో 276, ఖైరతాబాద్‌లో 125, జూబ్లీహిల్స్‌లో 92 మంది కొవిడ్ బారినపడ్డారు. అప్పటి వరకు మొత్తం 1,153 మందికి కరోనా సోకగా, అందులో 710 మందికి ఎవరి ద్వారా వ్యాపించిందో తెలియకపోవడం గమనార్హం. అంటే బాధితుల్లో 61శాతం మందికి వ్యాప్తి జాడ తెలియడం లేదు. ఒక్క ఖైరతాబాద్ జోన్‌లోనే 46 మరణాలు చోటు చేసుకున్నాయి. 253 మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు. 854 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చార్మినార్ జోన్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎల్బీనగర్ జోన్‌లో 350, సికింద్రాబాద్‌లో 400, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో కలిపి 250 మంది ఇప్పటి వరకు కరోనా బారినపడినట్లు యంత్రాంగం చెబుతోంది.
- ఆగని మరణాలు
డబీర్‌పురా ఠాణాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కరోనా లక్షణాలతో చికిత్స కోసం ఇటీవల మలక్‌పేటలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఖర్చులు అధికంగా ఉండటంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన మంగళ్‌హాట్‌లో లోయర్ ధూల్‌పేట ప్రాంతానికి చెందిన వ్యక్తి (55)కి వైద్య పరీక్షలు నిర్వహిస్తే కరోనా సోకినట్లు తేలింది. ఆయన్ని గాంధీకి తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు. అంబర్‌పేటకు చెందిన మరో వ్యక్తితోపాటు వేర్వేరు చోట్ల మరణాలు చోటు చేసుకున్నాయి.
ఇదీ చదవండి: నాన్న కోసం సైనికుడై.. దేశం కోసం అమరుడై..