పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది ఆరు ప్రశ్నపత్రాలకే పరిమితం చేయనున్నారు. అంతకుముందు 11 ప్రశ్నపత్రాలు ఉండగా కరోనా కారణంగా గతేడాది ఆరు పేపర్లకు తగ్గించినట్లు ప్రకటించినా.. తుదకు పరీక్షలే జరపలేదు. అప్పట్లో ఈ ఉత్తర్వులు ఆ ఏడాదికేనని ప్రభుత్వం పేర్కొంది. అవే ఉత్తర్వులు ఈ ఏడాదికీ పొడిగించే అవకాశం ఉంది. 2019-20లో మొదట అంతర్గత మార్కులు, బిట్ పేపర్‌ను తొలగించారు. ప్రతి సబ్జెక్టులోనూ 100 మార్కులకు ప్రశ్నలే ఉండేలా మార్పు చేశారు. ఈ విధానంలో ఒక్క ప్రశ్నపత్రంతో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 30శాతం సిలబస్ తగ్గించారు. ఇచ్చిన సిలబస్‌లోనూ అధ్యాయాలు, పాఠ్యాంశాలను మూడు కేటగిరీలుగా విభజించారు. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకునేవి, ఇంటి వద్ద చదువుకునేవి, ఐచ్ఛికంగా నేర్చుకునేవిగా వర్గీకరించారు. వీటిలో ఐచ్ఛికంగా నేర్చుకునే అధ్యాయాల నుంచి పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు. మొదటి, రెండు కేటగిరీల నుంచే ప్రశ్నలు ఇవ్వనున్నారు.
గతేడాది ఆరు పేపర్లతోపాటు పరీక్ష సమయాన్ని అర గంట పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ దఫా కూడా పరీక్ష సమయాన్ని 2.45 గంటల నుంచి 3.15 గంటల పాటు ఇవ్వనున్నారు. కొత్త విధానంలో ప్రశ్నల సంఖ్య కాకుండా మార్కులను మాత్రమే పెంచనున్నారు. 50 మార్కుల పేపర్లు 100 అవుతాయి. గతేడాదే పదో తరగతి పరీక్షల్లో పలు సంస్కరణలు ప్రతిపాదించినా... కొవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. ఈసారి ఆ మార్పులు అమలుకానున్నాయి.
నవోదయ విద్యార్థులందరు ఒకేచోట.. పోర్టల్ రూపొందించిన పూర్వ విద్యార్థులు