Pending Challans: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ చలాన్లను వాహనదారులు రాయితీపై చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారు. వీటి ద్వారా ఆ రాష్ట్ర ఖజానాకు రూ.135 కోట్లు జమ అయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా చెల్లింపులు చేశారు. ఆ తర్వాత సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు రాయితీపై చెల్లించే అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.
25 శాతమే చలాన్లు చెల్లించారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 కోట్ల పెండింగ్ చలాన్లు, 1,750 కోట్ల రూపాయలను వాహనదారులు చెల్లించాల్సి ఉంది. కరోనా కారణంగా చెల్లింపులు నిలిచిపోవడంతో... వాహనదారులకు ఊరటనిచ్చేలా పోలీస్ శాఖ ఈ నెల 1వ తేదీ నుంచి రాయితీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు రూ.500కోట్లు జమ అవుతాయని పోలీస్ శాఖ భావిస్తోంది. పదిహేను రోజులు ముగిసినా అందులో 25 శాతమే జమ కావడంతో పోలీసులు రాయితీ గురించి వాహనదారులకు మరింత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టారు. సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యం కల్పిస్తున్నారు.
అవగాహన లేకపోవడం వల్ల
వాహనదారులకు రాయితీ డబ్బులను ఎలా చెల్లించాలనే అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమని పోలీసులు భావిస్తున్నారు. మీసేవా కేంద్రాల్లోనూ చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ విషయం తెలియని వాహనదారులు ముందుకు రావడం లేదు. ఈ నెల 31వ తేదీ వరకు రాయితీపై చెల్లించే అవకాశం ఉన్నందున దాదాపు 80 నుంచి 90శాతం మందితోనైనా చెల్లింపులు చేయించే విధంగా ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఇదీ చదవండి : కువైట్‌లో ముగ్గురి హత్య కేసు.. సెంట్రల్ జైలులో కడప జిల్లావాసి వెంకటేశ్ ఆత్మహత్య