Tax on EPF interest: వేతన జీవులు భవిష్యత్తు అవసరాల కోసం భవిష్యనిధిలో ఉద్యోగి వాటా (ఈపీఎఫ్), స్వచ్ఛంద వాటా (వీపీఎఫ్)లో దాచుకుంటారు. ఇలా జమ చేసే మొత్తంపై గతంలో ఎలాంటి నిబంధనలూ ఉండేవి కావు. ఎంత మొత్తం జమ చేసినా.. దానికి పన్ను రహిత వడ్డీ చెల్లించేవారు. క్రితం ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధనలు మారాయి.
ఈపీఎఫ్, వీపీఎఫ్ ద్వారా జమ చేసే మొత్తం రూ.2,50,000కు మించితే, ఆపై అదనంగా జమచేసే పీఎఫ్ చందాపై ఈపీఎఫ్‌వో జమచేసే వడ్డీపై పన్ను విధించాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో చట్టానికి సవరణ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి టీడీఎస్ నిబంధన అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇక 2022 ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్‌ఖాతాలో పన్ను, పన్నేతర ఖాతాలను నిర్వహిస్తూ ఏటా జమ రూ.2.5 లక్షలు దాటితే, వడ్డీపై పన్ను విధించనుంది. ఉద్యోగి ఫైనల్ సెటిల్‌మెంట్, క్లెయిమ్, మినహాయింపు సంస్థల నుంచి ఈపీఎఫ్‌వో నగదు బదిలీ, ఈపీఎఫ్‌వో నుంచి మినహాయింపు సంస్థకు నగదు బదిలీ, ఒక ట్రస్ట్ నుంచి మరోట్రస్టుకు, గతంలోని ఖాతాల్లో నగదు బదిలీ అయినప్పటికీ పన్ను విధింపు కొనసాగుతుంది. ఉద్యోగి జమ రూ.2.5లక్షలకు మించినప్పటికీ, ఒకవేళ ఆ ఖాతాదారు చనిపోయినా సీలింగ్‌కు మించిన నగదు జమపై వచ్చే వడ్డీపై టీడీఎస్ అమలవుతుంది. ఉద్యోగి ఖాతాకు పాన్ అనుసంధానమైతే 10%, లేకుంటే 20% చొప్పున పన్ను పడుతుంది. ఉద్యోగి పీఎఫ్ ఖాతాల్లో వడ్డీని ఏడాదికి ఒకసారి జమచేసినప్పటికీ, ఖాతాల నిర్వహణ ప్రతినెలా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగి ఖాతాలో పన్నేతర, పన్ను పేరిట రెండు కాంపొనెంట్స్ ఏర్పాటు చేసి, ప్రతినెలా వడ్డీని లెక్కించి ఆ మొత్తంపై పన్ను గణిస్తారు. ఈ పన్ను ఏటా ఆదాయ పన్ను శాఖకు ఈపీఎఫ్‌వో జమ చేస్తుంది.
ఉదాహరణకు.. ఒక ఉద్యోగి వేతనం నుంచి ఉద్యోగి వాటా (12శాతం), స్వచ్ఛంద వాటాతో కలిపి నెలకు రూ.30వేలు పీఎఫ్ ఖాతాలో జమచేస్తున్నారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి అతని ఖాతాలో రూ.3.6లక్షలు జమ అవుతాయి. ఇందులో రూ.2.5 లక్షలు పన్నేతర ఖాతా, మిగతా రూ.1.10లక్షలు పన్నుపరిధి ఖాతాలోకి వెళ్తాయి. అంటే ఉద్యోగి డిసెంబరు చందా నాటికి మొత్తం రూ.2.7లక్షలు అవుతుంది. ఈ లెక్కన అప్పటికే పన్నేతర ఖాతాలో రూ.2.5 లక్షల సీలింగ్ దాటినందున, ఆ నెల నుంచి మిగతా సొమ్ము పన్ను ఖాతాలో జమ అవుతుంది. ఈ లెక్కన 8.1 శాతం వడ్డీ చొప్పున లెక్కిస్తే పన్నేతర ఖాతాలోని రూ.2.5 లక్షలకు ఏడాదికి రూ.14,044 వడ్డీ అవుతుంది. ఈ వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. పన్ను పరిధిఖాతాలో రూ.1.10 లక్షల జమకు నాలుగునెలలకు రూ.2362 వడ్డీ వస్తుంది. ఈ వడ్డీపై పది శాతం చొప్పున రూ.236 టీడీఎస్ జమ చేయాల్సి ఉంటుంది.
నెలకు రూ.30వేల చందా జమ చేస్తున్న మరో ఉద్యోగి ఆ ఏడాది జనవరిలో రూ.2.75 లక్షలు తన ఖాతా నుంచి ఉపసంహరించుకున్నారని అనుకుందాం. జనవరి నాటికి జమ అయ్యే రూ.3లక్షల్లో రూ.2.5లక్షలు పన్నేతర ఖాతాలో, మిగతా రూ.50వేలు పన్ను ఖాతాలో ఉంటాయి. జనవరిలో రూ. 2.75 లక్షల నగదు ఉపసంహరించుకుంటే, పన్నేతర ఖాతా నుంచి రూ.2.25 లక్షలు, పన్ను ఖాతా నుంచి రూ.50వేలు వెనక్కు తీసుకున్నట్లు పరిగణిస్తారు. నగదు ఉపసంహరించుకునే నాటికి జమచేసిన పన్నుపరిధి ఖాతాలోని నగదుపై వడ్డీని లెక్కించి ఆ మొత్తంపై టడీఎస్ విధిస్తారు. జనవరి నాటికి పన్నేతర ఖాతాలో రూ.2.5 లక్షల నుంచి రూ.2.25 లక్షలు వెనక్కు తీసుకున్నందున పన్నేతర ఖాతాలో ఏ ఏడాదిలోని తదుపరి నెలలకు నగదు జమను రూ.25వేల నుంచి లెక్కిస్తుంది. ఫిబ్రవరి, మార్చిలో నెలకు రూ.30వేల చొప్పున జమ చేసే నగదును పన్నేతర ఖాతాలోకి తీసుకుంటారు. పన్నేతర ఖాతాలో నగదు జమపై 8.1 శాతం వడ్డీ రూ.11,613 అవుతుంది. పన్ను ఖాతాలో రెండు నెలలకు జమ అయిన రూ.50వేలపై వడ్డీ రూ.675 అవుతుంది. ఈ మొత్తంపై 10 శాతం టీడీఎస్ అయితే రూ.68 అవుతుంది.
ఇదీ చూడండి: 'ఉద్యోగ అవకాశాలు పెరిగాయ్.. ఇదే నిదర్శనం!'
ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంపు