stock market today: ఆర్‌బీఐ రేట్ల పెంపు సంకేతాలతో ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి. దీంతో సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలను నమోదు చేశాయి. రెపోరేటు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటన వెలువడిన వెంటనే మార్కెట్లు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. కానీ, పెంపు ఊహించిన స్థాయిలోనే ఉండడం వల్ల మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో కాపేపటికే మార్కెట్లు లాభాల్లోకి ఎగబాకాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు కూడా అందుకు దోహదం చేశాయి. అయితే, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆర్‌బీఐ అంచనాలు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దారితీశాయి. దీంతో ఒంటిగంట తర్వాత సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకొని ఇక కోలుకోలేకపోయాయి. మరోవైపు వృద్ధిరేటు అంచనాలను తగ్గించడం కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారింది.
ఫ్లాట్గా మొదలై నష్టాల్లోకి: ఉదయం సెన్సెక్స్ 55,345.51 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,683.30 - 55,423.97 మధ్య కదలాడింది. చివరకు 214.85 పాయింట్ల నష్టంతో 54,892.49 వద్ద ముగిసింది. 16,474.95 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 60.10 పాయింట్లు నష్టపోయి 16,356.25 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,293.35 - 16,514.30 మధ్య ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.74 వద్దకు చేరింది.
లాభనష్టాల్లోనివి: సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఎస్‌బీఐ, టైటన్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. మళ్లీ వడ్డీ రేట్లు పెంపు