Refund For Home Buyers : కొత్తగా ఫ్లాట్ కొన్నవారికి కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. డెవలపర్ అనుకున్న సమయానికి ఫ్లాట్‌ను అందించకపోవచ్చు. లేదా ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం ఫ్లాట్‌ను నిర్మించకపోవచ్చు. లేదా నాణ్యతలేని మెటీరియల్స్‌తో ఫ్లాట్‌ను నిర్మించి ఇవ్వవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కొత్తగా ఫ్లాట్ కొన్నవారికి చాలా బాధగలుగుతుంది. కానీ ఏం చేయాలో తెలియదు. డెవలపర్స్ కూడా సరిగ్గా స్పందించరు. అయితే ఇకపై ఇలాంటి సమస్యలు ఎదురైతే.. కచ్చితంగా రిఫండ్ కోరవచ్చు అని రెరా చట్టాలు చెబుతున్నాయి.
సరైన తీర్పు
RERA Home Buying Rules : ఇటీవల జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయిలో ఓ ఫ్లాట్ కొన్న ముగ్గురు వ్యక్తులకు రూ.33 కోట్లు రిఫండ్ చేయాలని.. అలాగే సదరు మొత్తంపై 12 శాతం వడ్డీని కూడా చెల్లించాలని డెవలపర్లను ఆదేశించింది. కారణం ఏమిటంటే.. సదరు డెవలపర్లు సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు (Real Estate Project)ను ప్రమోట్ చేశారు. పైగా కొనుగోలుదారులకు సకాలంలో ఫ్లాట్‌ను అందించడంలో విఫలమయ్యారు. వాస్తవానికి గతంలో ఈ తరహా వివాదాలు తలెత్తినప్పుడు.. ఫ్లాట్ కొనుగోలుదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ, స్థిరాస్తి నియంత్రణ చట్టం 2016 (RERA) అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా వరకు మారాయి. స్థిరాస్తి ప్రాజెక్టుల్లో పారదర్శకత, జవాబుదారీతనం బాగా పెరిగింది. ముఖ్యంగా ఫ్లాట్స్ కొనుగోలు చేసేవారి హక్కులకు రక్షణ ఏర్పడింది.
ప్రతిదశలోనూ తెలియజేయాలి!
రెరా చట్టం ప్రకారం, డెవలపర్లు ప్రాజెక్టు నిర్మాణ స్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కొనుగోలుదారులకు తెలియజేయాలి. ఫ్లాట్ అగ్రిమెంట్ లేదా అలాట్‌మెంట్ లెటర్‌లో ఫ్లాట్ నిర్మాణానికి సంబంధించిన అన్ని వివరాలను కచ్చితంగా పొందుపర్చాలి. ఒకవేళ డెవలపర్.. ఫ్లాట్ నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్‌ను స్పష్టంగా తెలుపకుంటే.. కొనుగోలుదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ‘బిల్డర్-బయ్యర్ అగ్రిమెంట్ (BBA)’పై సంతకం చేయకూడదని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. మీరు కావాలనుకుంటే.. రెరా (RERA) వెబ్‌సైట్ నుంచి నిర్మాణ షెడ్యూల్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పూర్తైన వెంటనే స్వాధీనం చేసుకోవచ్చు!
రెరా చట్టంలోని సెక్షన్ 19(3) ప్రకారం, అగ్రిమెంట్‌లో పేర్కొన్న షెడ్యూల్ పూర్తయిన వెంటనే.. కొనుగోలుదారులు ఫ్లాట్‌ను తమ స్వాధీనంలోకి తీసుకోవచ్చు. అయితే కామన్ ఏరియా మాత్రం బిల్డింగ్ అసోసియేషన్ పరిధిలోకి వెళ్లిపోతుంది.
రిఫండ్ కోరవచ్చు!
Refund Of Money In Case Of Cancellation Of Property Deal : రెరా చట్టంలోని సెక్షన్ 19(4) ప్రకారం, ఒకవేళ డెవలపర్ అగ్రిమెంట్‌లోని నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. అప్పటి వరకు చెల్లించిన మొత్తాన్ని రిఫండ్ చేయమని కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుంది. పైగా జాప్యం జరిగిన కాలానికి వడ్డీ కూడా డిమాండ్ చేసే హక్కు ఉంటుంది. ఇక్కడ మరొక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఒకవేళ ప్రాజెక్టులో మార్పుల కోసం డెవలపర్లు.. ముందుగానే కొనుగోలుదారుల వద్ద నుంచి అనుమతి తీసుకున్నప్పటికీ.. నిర్మాణంలో జాప్యం జరిగితే.. పరిహారం ఇవ్వకుండా తప్పించుకోలేరు.
కొన్నిసార్లు డెవలపర్లు అగ్రిమెంట్‌లో లేనివిధంగా నిర్మాణంలో మార్పులు చేస్తూ ఉంటారు. ఇందుకోసం కొనుగోలుదారుల నుంచి అనుమతి కూడా తీసుకుంటారు. అయితే ఈ కొత్త మార్పులు కొనుగోలుదారులకు ఇబ్బందిగా మారితే.. అప్పుడు కూడా రిఫండ్ చేయమని కోరేవచ్చు అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే సకాలంలో ఆస్తిని అందించకపోతే, డెవలపర్‌కు లీగల్ నోటీసులు పంపించవచ్చు. దానికి సమాధానం ఇవ్వకుండా మరింత ఆలస్యం చేస్తే రెరా చట్టం ప్రకారం, ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసి రిఫండ్ కోసం డిమాండ్ చేయవచ్చు.
పత్రాలను కోరే హక్కుంది..
రెరా చట్టంలోని సెక్షన్ 19(5) ప్రకారం.. డెవలపర్ నుంచి కీలకమైన పత్రాలన్నింటినీ కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుంది. ముఖ్యంగా.. నిర్మాణానికి సంబంధించిన మ్యాపులు, ప్రాజెక్టు అనుమతి పత్రాలు, నిరభ్యంతర పత్రాలను అడిగి తీసుకోవచ్చు. ముందు చెప్పినట్లుగా నిర్మాణం జరగట్లేదని ఏ దశలోనైనా భావిస్తే సెక్షన్ 35 కింద అభ్యంతరం చెప్పవచ్చు. అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా.. ఫ్లాట్ కొనేముందరే అన్ని పత్రాలను డెవలపర్ నుంచి తీసుకోవాలి. ఒక వేళ ఏవైనా పత్రాలను ఇవ్వడానికి డెవలపర్లు వెనకాడితే.. అలాంటి ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఈ పత్రాలను కచ్చితంగా చెక్ చేయాలి!
- కొనుగోలుదారులు.. డెవలపర్ నుంచి కచ్చితంగా యూనిట్ బుకింగ్ ఫారం, అలాట్‌మెంట్ లెటర్, బీబీఏను తీసుకోవాలి.
- సేల్ డీడ్‌ను సంబంధిత అథారిటీ వద్ద కచ్చితంగా నమోదు చేయించాలి.
- ఆస్తి స్వాధీన పత్రం (Possession letter), చెల్లింపు రశీదులు సహా అన్ని పత్రాలను సేకరించుకోవాలి.
- ప్రాజెక్టు పూర్తయిన తరువాత అధికారులు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలను కూడా డెవలపర్ నుంచి కచ్చితంగా తీసుకోవాలి.
- ఒకవేళ రుణం తీసుకున్నట్లయితే బ్యాంకు నుంచి సంబంధిత లోన్ డాక్యుమెంట్స్‌ను, మూడు పక్షాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను తీసుకోవాలి.