How To File Cyber Crime Complaint Online : నేటి టెక్నాలజీ యుగంలో తెరచాటు దొంగలు ఎక్కువైపోయారు. సైబర్ నేరగాళ్లు కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న కొద్ది స్కామర్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయాలంటే అవగాహనే ప్రధాన ఆయుధం. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల కోల్పోయిన వాటిని తిరిగి పొందవచ్చు. అయితే సైబర్ నేరాల విషయంలో బాధితులు ఎలా స్పందించాలి? ఫిర్యాదు ఎలా చేయాలి? అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
సైబర్ క్రైమ్‌పై ఫిర్యాదు చేయు విధానం
- ముందుగా https://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో File a complaint లింక్‌పై క్లిక్ చేయాలి.
- నిబంధనలు, షరతులను చదివి అంగీకరించాలి.
- మహిళలు లేదా పిల్లలకు సంబంధించిన సైబర్ క్రైమ్ జరిగితే, Report And Track బటన్‌పై క్లిక్ చేయాలి.
- సాధారణ సైబర్ క్రైమ్ అయితే Report Cyber Crime బటన్‌పై క్లిక్ చేయాలి.
- Citizen Login ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ పేరు, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ మొదలైన వాటితో సహా అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
- మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేసి, CAPTCHAను నింపి, ఆపై సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- తదుపరి పేజీలో, మీరు రిపోర్ట్ చేయాలని అనుకుంటున్న సైబర్ క్రైమ్ వివరాలను నమోదు చేయాలి.
- ఈ దరఖాస్తులో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి: సంఘటన వివరాలు , అనుమానితుల వివరాలు , ఫిర్యాదు చేసిన వ్యక్తుల వివరాలు, ప్రివ్యూ. వీటికి సంబంధించిన వివరాలు అన్నింటినీ పూరించాలి.
- మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉంటే, వారికి సంబంధించిన వివరాలను కూడా తెలపాలి.
భయపడవద్దు!
సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. విషయం ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందనే భయమే ఇందుకు కారణం. అందుకే సైబర్ నేరగాళ్లు మరింత యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి సైబర్ క్రైమ్ ఫిర్యాదులను చాలా గోప్యంగా ఉంచుతారు. వివరాలను ఎప్పటికీ బయటపెట్టరు. కనుక నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం మంచిది.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసుకునేందుకు కేంద్ర హోంశాఖ పలు ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా https://www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా కానీ, 1930 అనే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కానీ సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ సమాచార గోప్యతను పాటిస్తారు. ఆర్థిక నేరాలు సహా, మహిళలు, పిల్లలపైన జరిగిన నేరాల గురించి వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయడానికి 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ఉత్తమం.
మీరు ఆర్థిక మోసానికి సంబంధించిన ఫిర్యాదును ఫైల్ చేస్తున్నట్లయితే, ఆరోపించిన మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన రుజువులను కూడా జతచేయవలసి ఉంటుంది. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, అడ్రస్‌లు, ఐడీ ప్రూఫ్‌లు, మీరు స్వీకరించిన ఏవైనా అనుమానాస్పద సందేశాలు లేదా ఈ-మెయిల్‌లు లాంటి సాక్ష్యాలు కేసును త్వరితగతిన చేధించడానికి సాయపడతాయి.
మీ లోన్ అప్లికేషన్ తరచూ రిజెక్ట్ అవుతోందా? ఏం చేయాలో తెలుసా?
కొత్త సంవత్సరంలో ఫైనాన్షియల్ గోల్స్ - ఇలా సెట్ చేసుకుంటే తిరుగుండదు!