How Much Gold One Person Can Legally Hold : మన దేశంలో బంగారాన్ని జనం ఎంతగా ప్రేమిస్తారో అందరికీ తెలిసిందే. వయసు, ఆదాయంతో సంబంధం లేకుండా.. ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ధనవంతులు తమకు కావాల్సినంత బంగారం కొనుగోలు చేస్తే.. సామాన్యులు స్థాయికి తగినట్టుగా కొనుక్కుంటారు. అయితే.. చట్టప్రకారం దేశంలో ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండాలో మీకు తెలుసా..? ఆ పరిమితి దాటితే ఏమవుతుంది..? వంటి ప్రశ్నలకు ఈ స్టోరీలో సమాధానాలు తెలుసుకుందాం.
చట్టం ప్రకారం ఎంత బంగారం ఉండొచ్చంటే..?
ఆదాయపు పన్ను చట్టం(Income Tax Act) ప్రకారం.. వ్యక్తుల వద్ద ఉండే బంగారంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం వ్యక్తులు కొంత మొత్తంలో బంగారం కలిగి ఉండొచ్చు. అంతకు మించి తమ వద్ద బంగారం ఉంటే మాత్రం.. దానికి లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఆదాయపన్ను చట్టం 1961లోని 132 సెక్షన్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు.. మీ వద్ద పరిమితికి మించి బంగారం లభిస్తే.. అవి ఎలా వచ్చాయో చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. వారసత్వంగా సంక్రమించిన నగలైతే.. గిఫ్ట్ రూపంలో వచ్చిన డాక్యుమెంట్స్ కూడా చూపించాలి. ఇలా.. బంగారం మీదే అని చెప్పేందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉంటే ఏమీ కాదు. లేదంటేమాత్రం జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు..?
వ్యక్తుల వద్ద ఎంత బంగారం ఉండాలనే విషయంలో ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించారు. అవి అందరికీ సమానంగా లేవు. ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. పెళ్లైన మహిళల తన వద్ద 500 గ్రాముల వరకు బంగారాన్ని నిల్వ చేసుకునే హక్కు ఉంది. ఇందుకు సంబంధించిన పత్రాలు ఎవ్వరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఇంతకు మించి ఉంటే మాత్రం సంబంధిత పత్రాలు చూపించాలి.
వివాహం కాని మహిళల విషయానికి వస్తే.. వారి వద్ద 250 గ్రాముల వరకు బంగారం ఉండొచ్చు. పురుషులకైతే ఇంకా తక్కువ హక్కే ఉంది. వారు 100 గ్రాముల వరకే బంగారం కలిగి ఉండొచ్చు. వివాహితుడైనా.. అవివాహితుడైనా వంద గ్రాముల పరిమితి మించడానికి వీల్లేదు. ఒకవేళ పరిమితికి మించితే పత్రాలు చూపించాలి. ఒక్కోసారి పత్రాలు మాత్రమే కాదు.. అందుకు సంబంధించిన ఆదాయ మార్గాలను కూడా చెప్పాల్సి ఉంటుంది. సరైన ఆధారాలు చూపించకపోతే పరిమితికి మించి ఉన్న బంగారాన్ని జప్తు చేసే అధికారం ఉంటుంది.