Financial Plans After Retirement: ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం.. 2019లో భారతీయుల సగటు జీవితకాలం 69.7 ఏళ్లు. 1980 లెక్కలతో పోలిస్తే ఇది దాదాపు 15 ఏళ్లు పెరిగింది. సుదీర్ఘ జీవిత కాలం ఆనందించదగ్గ విషయమే. కానీ, పదవీ విరమణ తర్వాత అధిక జీవన కాలాన్ని ఇది సూచిస్తోంది. దీనికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.
ప్రణాళికతో మొదలు..: ప్రయాణం మొదలు పెట్టేముందు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆర్థిక విషయాల్లోనూ ఇదే వర్తిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మనం వేసుకున్న ప్రణాళిక కాలానుగుణంగా వాస్తవ పరిస్థితుల్లో సవరించుకునేలా ఉండాలి. ఆలోచన ఉండగానే సరికాదు. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విలువ. ఇప్పుడున్న ప్రణాళిక 10 ఏళ్ల తర్వాత పూర్తిగా భిన్నంగా మారిపోవచ్చు. ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం, మారుతున్న అవసరాలు, జీవన శైలిలో మార్పులు ఇలా ఎన్నో దీనికి కారణం అవుతాయి. కాబట్టి, ముందుగా మీరు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు, భవిష్యత్‌లో ఎలా ఉండవచ్చు అనే అంశాన్ని ఆలోచించండి. అందుకు అనుగుణంగా పొదుపు మొత్తాలను కేటాయించండి. పదవీ విరమణ ప్రణాళిక నిరంతరం సాగే ప్రక్రియ. మధ్యలో ఆపేస్తే.. విశ్రాంత జీవితంలో ప్రశాంతత కొరవడుతుంది.
జీవన శైలికి తగ్గట్టుగా..: రిటైర్మెంట్ అనంతరం మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఎక్కడ స్థిర నివాసం ఉంటారు? సొంతిల్లా? అద్దె ఇల్లా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఈ సందేహాలు వాస్తవ దూరం అనిపించవచ్చు. వీటికి కచ్చితమైన సమాధానాలూ అవసరం లేదు. కానీ, అంచనాలైనా ఉండాల్సిందే. ఇవీ అత్యుత్తమంగా ఉండేలా చూసుకోండి. మీరు పదవీ విరమణ దగ్గరకు వచ్చే సరికి ఈ అంచనాలు వాస్తవ రూపంలోకి మారేందుకు ఏం చేయాలన్నది చూసుకోండి. వసతి, ఆహారం, సాధారణ ఔషధాల ఖర్చు, ఇతర జీవన శైలి వ్యయాలు.. ఎంత మేరకు అవుతాయనే లెక్కలు వేసుకోవాలి. మీరు భవిష్యత్‌ను ఇప్పటి నుంచే ఊహిస్తే.. దానికి అనుగుణంగా మీ పెట్టుబడులూ కొనసాగించాలి. అంచనాలను రూపొందించుకునేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు. మీ పదవీ విరమణకు మరో అయిదేళ్ల సమయం ఉంది అనుకుంటే.. ఇప్పటి నెలవారీ ఖర్చు.. అయిదేళ్ల తర్వాత ఎంత ఉండొచ్చు అనేది లెక్క వేసుకోవాలి. అందుకు అనుగుణంగా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి.
పొదుపులో వృద్ధి..: మీ నెలవారీ ఖర్చుల పట్ల అంచనాకు వచ్చాక.. చూడాల్సింది అందుకు అనుగుణంగా మీ పొదుపు, పెట్టుబడులు ఉన్నాయా అని. మీ రిటైర్మెంట్ నాటికి ఎంత మొత్తం జమ అయ్యే అవకాశం ఉందనేదీ లెక్క వేసుకోవాలి. చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్లు, స్థిరాస్తి తదితర మార్గాల్లో మదుపు చేస్తుంటారు. వీటిలో పదవీ విరమణ వరకూ కొనసాగేవి తక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు కొంత మొత్తం పిల్లల చదువులు ఇతర అవసరాల కోసం వెనక్కి తీసుకుంటారు. లేదా ఆరోగ్య అత్యవసరాలు ఏర్పడవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, పొదుపు మొత్తాన్ని క్రమంగా పెంచుతూ ఉండాలి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి దీటుగా రాబడినిచ్చే పెట్టుబడులను ఎంచుకోవాలి. పదవీ విరమణ అనంతరం ఎంత మొత్తం అవసరం.. ఈ పెట్టుబడులు ఎంత మేరకు ఆ నిధిని జమ చేసేందుకు తోడ్పడతాయి అనే లెక్కలు ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి.
ఉద్యోగం చేస్తున్నన్ని రోజులూ మీరు త్యాగం చేసిన ఎన్నో విషయాలను నెరవేర్చుకునేందుకు విశ్రాంత జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆర్థికంగా ముందు నుంచీ ప్రణాళిక వేసుకున్నప్పుడే ఇది సాధ్యం అవుతుందన్నదీ మర్చిపోవద్దు.
- శ్రీనివాస్ బాలసుబ్రమణియం, ప్రొడక్ట్స్ హెడ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్
లోటును భర్తీ చేసేలా..: పదవీ విరమణ చేశాక ఎంత మొత్తం అవసరం అనే అవగాహన వచ్చాక చేయాల్సింది.. మీ ప్రస్తుత పొదుపు.. అది ఎంత మేరకు వృద్ధి చెందుతుంది.. నెలవారీ ఖర్చులను తట్టుకునేందుకు అవి ఎంత మేరకు సహాయం చేస్తాయి అని తెలుసుకోవాలి. ఉదాహరణకు మీ రిటైర్మెంట్ అనంతరం నెలకు రూ.50వేలు అవుతాయని అంచనా వేశారనుకుందాం. మీ ప్రస్తుత పొదుపు మొత్తం నుంచి వచ్చేది రూ.30వేలే అనుకుందాం. మిగతా రూ.20వేల కోసం పెట్టుబడి ప్రణాళిక రూపొందించుకోవాలి. సురక్షితంగా ఉంటూ ఆదాయాన్ని అందించే పథకాలను ఎంపిక చేసుకునేటప్పుడు యాన్యుటీ పాలసీలను పరిశీలించవచ్చు. వెంటనే పింఛను ఇచ్చే 'ఇమ్మీడియట్ యాన్యుటీ'లు పదవీ విరమణ చేసిన వారికి ఉపయోగం. 10 ఏళ్లకు మించి వ్యవధి ఉన్నప్పుడు 'డిఫర్డ్ యాన్యుటీ' పథకాలను ఎంచుకోవచ్చు. వీటిని తీసుకునేటప్పుడు జీవితాంతం వరకూ పింఛను ఇచ్చే ఏర్పాటు చేసుకోవాలి.
ఇదీ చదవండి: ట్విట్టర్ కోసం టెస్లా షేర్లను అమ్మిన మస్క్.. ఆందోళనలో ఇన్వెస్టర్లు!