స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం సెషన్లో అదరగొట్టాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 958 పాయింట్లు పెరిగి మొట్ట మొదటిసారి 59,885 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 276 పాయింట్ల లాభంతో 17,823 వద్దకు చేరింది. ఆరంభం నుంచే మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతూ వచ్చింది.
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లలో మార్పు చేయకపోవచ్చనే అంచనాలు మార్కెట్లకు బూస్ట్ ఇచ్చాయి. దీనికి తోడు సంక్షోభంలో చిక్కుకున్న చైనా రియల్టీ దిగ్గజం.. ఎవర్‌గ్రాండే ఛైర్మన్ ప్రస్తుత పరిస్థితిపై వివరణ ఇచ్చారు. ఈ కష్టకాలం నుంచి సంస్థ కచ్చితంగా బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన కూడా మార్కెట్లకు సానుకూలతలు పెంచింది. ఆర్థిక, రియల్టీ షేర్లు భారీగా లాభాలను గడించాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,957 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 59,243 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,843 పాయింట్ల గరిష్ఠ స్థాయి (కొత్త గరిష్ఠం), 17,646 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
బజాజ్ ఫిన్సర్వ్, ఎల్&టీ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ భారీగా లాభాలను నమోదు చేశాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో డాక్టర్ రెడ్డీస్, నెస్లే ఇండియా, ఐటీసీ మాత్రమే నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను గడించాయి. కోస్పీ (దక్షిణ కొరియా) నష్టపోయింది. నిక్కీ (జపాన్) సెలవులో ఉంది.
ఇదీ చదవండి: ఐఓసీఎల్‌లో ఉద్యోగ అవకాశాలు- నెలకు రూ.1.05 లక్షల జీతం!