టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ)(Wpi inflation) మళ్లీ స్వల్పంగా పెరిగింది. అక్టోబరులో టోకు ద్రవ్యోల్బణం 12.54 శాతంగా నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆహార వస్తువులు, చమురు ధరల పెరుగుదల కారణంగానే టోకు ద్రవ్యోల్బణం(Wpi inflation) పెరిగినట్లు పేర్కొంది.
డబ్ల్యూపీఐ(Wpi inflation) రెండంకెలపైన నమోదవడం వరుసగా ఇది ఏడో నెల కావడం గమనార్హం. సెప్టంబరులో టోకు ద్రవ్యోల్బణం 10.66 శాతంగా ఉంది. గత ఏడాది అక్టోబరులో ద్రవ్యోల్బణం 1.31 శాతంగా ఉంది.
ఇదే కారణం..
మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, తయారీ వస్తువులు, చమురు, పెట్రోలియం, సహజ వాయువు, రసాయనాలు, రసాయనిక ఉత్పత్తుల తదితరాల ధరలు పెరగడమే.. అక్టోబరులో టోకు ద్రవ్యోల్బణం పెరిగేందుకు ప్రధాన కారణమని కేంద్రం పేర్కొంది.
తయారీ వస్తువులపై టోకు ద్రవ్యోల్బణం అక్టోబరులో 12.04శాతంగా నమోదైంది. ఇది గత నెలలో 11.41శాతం మాత్రమే ఉంది.
ముడి చమురు ద్రవ్యోల్బణం అక్టోబరులో 80.57శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. ఇది సెప్టెంబరులో 71.86శాతంగా ఉందని పేర్కొంది.
ఆహార వస్తువుల టోకు ద్రవ్యోల్బణం అక్టోబరులో -1.69శాతంగా నమోదవగా.. సెప్టెంబరులో -4.69శాతంగా ఉంది. కూరగాయల ధరలు అక్టోబరులో -18.49శాతంగా ఉండగా.. ఉల్లి టోకు ద్రవ్యోల్బణం -25.01శాతంగా ఉంది.
ఇదీ చూడండి: మరింత పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం