Indian economy news: మరో పదేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. వచ్చే ఏడాది (2022) ఫ్రాన్స్‌ను అధిగమించి ఆరో స్థానంలో భారత్ నిలుస్తుందని ది సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) తాజా నివేదికలో పేర్కొంది. లండన్ కేంద్రంగా పనిచేసే ఈ ఆర్థిక కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన వార్షిక నివేదిక 'వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ (డబ్ల్యూఈఎల్‌టీ)' ప్రకారం.. 2021లో భారత్ 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే ఏడాది మళ్లీ ఫ్రాన్స్‌ను అధిగమించి 6వ స్థానానికి చేరుతుంది. 2023లో బ్రిటన్ కంటే భారత ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లి, అయిదో స్థానానికి చేరొచ్చని నివేదిక అంచనా వేసింది. కొవిడ్ పరిణామాలతో గతేడాది ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడినా, అమెరికా, బ్రెజిల్ తరవాత దేశీయంగా అధికంగా మరణాలు నమోదైనా, ప్రభుత్వం అత్యవసరంగా తీసుకున్న చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ సత్వరం కోలుకుందని పేర్కొంది. అందువల్ల 2020లో జీడీపీ 7.3 శాతం క్షీణతను నమోదు చేసినా, 2021లో 8.5 శాతం వృద్ధి చెందే వీలుందని తెలిపింది.
2022లో 100 లక్షల కోట్ల డాలర్లకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో తొలిసారిగా 100 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.7,500 లక్షల కోట్ల) స్థాయికి చేరొచ్చని సీఈబీఆర్ పేర్కొంది. కొవిడ్ పరిణామాల నుంచి క్రమంగా అంతర్జాతీయ జీడీపీ కోలుకోవడం ఇందుకు కారణమని తెలిపింది. అయితే ద్రవ్యోల్బణం నుంచి ఆర్థిక వ్యవస్థలను రక్షించుకునేందుకు ఆయా దేశాలు ఏ చర్యలు తీసుకుంటాయనేదే ముఖ్యమని సీఈబీఆర్ డిప్యూటీ ఛైర్మన్ డగ్లాస్ మెక్ విలియమ్స్ పేర్కొన్నారు. ఈ విషయంలో విఫలమైతే 2023/2024లో మాంద్యం ఎదురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. 2030 నాటికి అమెరికాను చైనా అధిగమించి, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- కొత్త ఏడాదిలో దుస్తులు, పాదరక్షల ధరలకు రెక్కలు!