తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని అనడం సరికాదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి సమాఖ్య స్ఫూర్తితోనే వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదికలోని అంశాల ప్రాతిపదికగానే రాష్ట్రాలకు నిధులు కేటాయించామని తెలిపారు.
''కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి కూడా వచ్చాయి. ఇది సరికాదు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే కేంద్ర పన్నుల వాటా 42 నుంచి 41 శాతానికి తగ్గింది'' అని హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆమె చెప్పిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
గతంలో కంటే 128 శాతం పెరుగుదల
- దేశంలో ఒక రాష్ట్రం తగ్గి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు పెరిగిన నేపథ్యంలోనే ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. తెలంగాణకు కేంద్రం నుంచి 2010-2015 మధ్య రూ.46,747 కోట్లు రాగా, 2015-20 కాలంలో రూ.1,06,606 కోట్లు ఇచ్చాం.
- గతంలో కంటే ఇది 128 శాతం పెరుగుదల. తెలంగాణ విషయంలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల సడలింపుతో రాష్ట్రం 0.5 శాతం రుణాలు అధికంగా తీసుకునేందుకు అవకాశం కలిగింది.
- పన్ను వసూళ్లలో చురుకుదనం, మంచి పనితీరు కనబరిచే రాష్ట్రాలను ప్రోత్సహించాలనేదే మా అభిమతం. ఆర్థిక సంఘం నివేదిక ప్రస్తుతం ఏడాది కాలానికే ఇచ్చింది. మరో అయిదేళ్లకు పూర్తి నివేదికను అక్టోబర్‌లోపు ఇస్తుంది.
- జీఎస్టీ ద్వారా పరిహారం ఇవ్వకపోవడం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే కాదు. జీఎస్టీ చట్టం ప్రకారం కాంపెన్‌సేషన్ సెస్ ద్వారానే ఈ సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ఆ సెస్ తగ్గడం వల్లే ఏ రాష్ట్రానికీ ఇవ్వలేకపోయాం. వసూలైన జీఎస్టీ పరిహారం ఇచ్చేశాం.
- తర్వాత కూడా బాకీ ఉంటే సెస్ ద్వారా వచ్చే కొద్దీ ఇస్తూ ఉంటాం. ఉపాధిహామీ పథకం కేటాయింపులు తగ్గించలేదు. రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ఎలాంటి జాప్యం లేదు.
- తెలంగాణ రాష్ట్రానికి రూ. 756 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును పునఃపరిశీలనకు పంపాం. ఆర్థిక సంఘానికి నిర్దేశించిన నిబంధనల్లో ఈ ప్రత్యేక నిధుల కేటాయింపు అంశం లేదు. పన్నుల వాటా, విపత్తు నిర్వహణ నిధులు, రెవెన్యూ లోటు, స్థానిక సంస్థలకు నిధులు ఇవే ఉన్నాయి.
ఇవీ చూడండి:
ఏప్రిల్ 1 నుంచి సరళీకృత జీఎస్‌టీ విధానం: నిర్మలా సీతారామన్