తుక్కు చేయండి.. లబ్ధి పొందండి - వాహనాల తుక్కు విధానం
పార్లమెంట్ ఉభయసభల్లో వాహన తుక్కు విధానం గురించి ప్రకటించారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. అక్టోబర్ నుంచి దశల వారీగా ఈ పద్ధతి అమల్లోకి వస్తుందని అన్నారు. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా పదివేల మందికి, పరోక్షంగా 35వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
కాలుష్యపరంగా, ఆర్థికంగా భారంగా మారిన పాతవాహనాలను తుక్కు కిందికి మార్చే స్క్రాపింగ్ విధానాన్ని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ గురువారం పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటించారు. 15 ఏళ్లపైబడిన వాణిజ్యవాహనాలు, 20 ఏళ్లపైబడిన ప్రైవేటు వాహనాలు అన్‌ఫిట్‌గా తేలి, వాటి రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించకపోతే అలాంటివాటన్నింటినీ తుక్కుగా మార్చాలని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇలాంటి నిబంధనలతో సంబంధం లేకుండా 15 ఏళ్ల పైబడిన అన్ని ప్రభుత్వ వాహనాలనూ సేవల నుంచి ఉపసంహరించి తుక్కుగా మార్చి కొత్త వాహనాలకు వెళ్తే వాటి కొనుగోళ్లపై రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జర్మనీ, యూకే, అమెరికా, జపాన్‌లాంటి దేశాల్లో అనుసరిస్తున్న ప్రపంచస్థాయి విధానాల ప్రకారం దేశంలో వాహన తుక్కు విధానాన్ని అమలుచేయనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా పదివేల మందికి, పరోక్షంగా 35వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కొత్త వాహనాల కొనుగోళ్లు పెరగడంవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.30-40వేల కోట్ల జీఎస్‌టీ ఆదాయం పెరుగుతుందని చెప్పారు.
ఏ వాహనాన్ని తుక్కు చేయాలి
తుక్కుగా మార్చడానికి కొలమానం: ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమై, రెన్యూవల్‌కు వీలుకాని వాహనాలను ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికిల్‌గా ప్రకటిస్తారు. అలాంటి వాటిని తప్పనిసరిగా సేవల నుంచి ఉపసంహరించి తుక్కుగా మార్చాల్సి ఉంటుంది.
వాణిజ్యవాహనాలు: వీటి ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను పునరుద్ధరించకపోతే 15ఏళ్ల తర్వాత తప్పనిసరిగా సేవల నుంచి ఉపసంహరించాలి. ఇలాంటి వాహన వినియోగాన్ని నిరుత్సాహపరచడానికి 15 ఏళ్ల తర్వాత వీటి ఫిట్‌నెస్‌సర్టిఫికెట్ ఫీజును పెంచనున్నారు.
ప్రైవేటు వాహనాలు: ఫిట్‌నెస్‌లో ఫెయిలై, రిజస్ట్రేషన్ పునరుద్ధరణకు వీలుకాని 20 ఏళ్ల పైబడిన ప్రైవేటు వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. ఈ దిశలో ప్రోత్సహించడానికి వీలుగా వీటి రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ ఛార్జీలను పెంచనున్నారు.
ప్రభుత్వ వాహనాలు: 15 ఏళ్ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఆర్‌టీసీ, ప్రభుత్వరంగ సంస్థలన్నింటి వాహనాలను రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. అవి ఉపయోగించడానికి వీల్లేదు. తప్పనిసరిగా వాటన్నింటినీ తుక్కుగా మార్చాల్సిందే.
ఎప్పటి నుంచి అమల్లోకి
- ఫిట్‌నెస్ టెస్ట్, స్క్రాపింగ్ సెంటర్ల ఏర్పాటుకు నిబంధనల అమలు: 2021 అక్టోబర్ 1 నుంచి
- 15 ఏళ్లపైబడిన ప్రభుత్వవాహనాల స్క్రాపింగ్ ప్రారంభం : 2022 ఏప్రిల్ 1 నుంచి
- ఫిట్‌నెస్‌టెస్ట్ ఎప్పటినుంచి తప్పనిసరి: భారీ వాణిజ్యవాహనాలకు: 2023 ఏప్రిల్ 1 నుంచి
- మిగతా వాహనాలకు ఎప్పటినుంచి: 2024 జూన్ 1 నుంచి దశలవారీగా
ఎందుకీ స్క్రాపింగ్ పాలసీ
దేశంలో ప్రస్తుతం 20 ఏళ్లపైబడిన తేలికపాటి వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్లకుమించినవి 34 లక్షలు ఉన్నాయి. ఎలాంటి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని 15 ఏళ్లకుమించిన భారీ వాణిజ్యవాహనాలు 17 లక్షలు ఉన్నాయి. కొత్తవాహనాలతో పోలిస్తే పాతవాహనాలు 10-12 రెట్లు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇప్పుడు ఈ విధానాన్ని అమల్లోకి తేవడం వల్ల కాలుష్య సమస్య తగ్గుతుంది.
- పాత, లోపభూయిష్టమైన వాహనాల సంఖ్యను తగ్గించడం.
- వాహన కాలుష్యాన్ని 25-30% తక్కువ చేయడం.
- రహదారి భద్రతను పెంచడం.
- తేలికపాటి ఆధునిక వాహనాలను తేవడం ద్వారా ఇంధన వినియోగసామర్థ్యాన్ని పెంచడం. తద్వారా ఇంధన దిగుమతుల ఖర్చును తగ్గించుకోవడం. ఎయిర్‌బ్యాగ్స్‌లాంటి ఆధునిక భద్రతతోకూడిన వాహనాలను వినియోగదారులు వాడేలా ప్రోత్సహించడం.
- ఈ తుక్కు విధానం వల్ల తయారీ, సేవారంగంలో వృద్ధి పెరుగుతుంది.
- ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్ పరిశ్రమకు చౌకధరల్లో ముడిసరుకును అందుబాటులోకి తేవడానికి వీలవుతుంది.
లాభమేంటంటే..
- రిజిష్టర్డ్ తుక్కు కేంద్రాల ద్వారా వాహనాలను తుక్కుగా మార్చిన వాహన యజమానులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తారు.
- స్క్రాపింగ్ సెంటర్ నిర్ధారించే పాత వాహనం తుక్కు విలువ మేర కొత్త వాహనం ఎక్స్‌షోరూం ధరలో మినహాయింపు (దాదాపు 4-6%) ఇస్తారు.
- వ్యక్తిగతవాహనాల రోడ్డుపన్నుల్లో 25%, వాణిజ్యవాహనాల రోడ్డు పన్నులో 15% మేర రాయితీ కల్పిస్తారు.
- కొత్త వాహన రిజిస్ట్రేషన్ ఫీజును రద్దుచేస్తారు.
- పాతకారు తుక్కు కింద మార్చి కొత్తది కొంటే కలిగే ప్రయోజనాలు (స్విఫ్ట్‌డిజైర్ స్థాయికారు)
- తుక్కు విలువ: కారు విలువలో 4%= రూ.32,000
- తయారీదారు డిస్కౌంట్ 5%= రూ.40,000
- రహదారిపన్నులో మూడేళ్లపాటు 25% రాయితీ= రూ.3,000
- పాత దాంతో పోలిస్తే నిర్వహణ ఖర్చు దాదాపు సగం తగ్గుదల
- కొత్త వాహనం ఇంధన సామర్థ్యం ఎక్కువ కాబట్టి పెట్రోల్, డీజిల్‌పై చేసే ఖర్చు తగ్గుదల.
నాణ్యతా ప్రమాణాలు ఎలా?
- బెల్జియం మోడల్ ప్రకారం 90% ముడిసరుకును రికవరీ చేయాలి. ముడిసరుకు రికవరీ శాతం ఆధారంగా స్క్రాపింగ్ సక్సెస్‌రేట్‌ను నిర్ణయిస్తారు. దాంతోపాటు ఇందులోంచి తీసిన వస్తువులను ఎలక్ట్రానిక్, ఆటోమోటివ్ పరిశ్రమకు ఉపయోగపడేలా తక్కువ ఖర్చుతో రీసైక్లింగ్ చేయాలి. రిజిష్టర్డ్ స్క్రాపింగ్ సెంటర్లలో పార్కింగ్‌కు తగినంత స్థలం ఉండాలి. గాలి, నీరు, శబ్దకాలుష్యాన్ని నియంత్రించే వ్యవస్థలు ఏర్పాటుచేసుకోవాలి. ప్రమాదకరవ్యర్థాలను పూర్తిగా నిర్మూలించాలి.
- రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, ఆటోమొబైల్ కంపెనీలు సంయుక్తంగా పీపీపీ విధానంలో స్క్రాపింగ్‌సెంటర్లు ఏర్పాటుచేసుకోవచ్చు.
- ఇందుకోసం దేశంలో జిల్లాకొకటి చొప్పున 718 జిల్లాల్లో ఫిట్‌నెస్ సెంటర్లు ఏర్పాటుచేస్తారు. అందులో వాహనాలను పరీక్షించి ఏవి స్క్రాప్ చేయాలన్నది నిర్ణయిస్తారు.
ఇదీ చదవండి:'మాల్యా, నీరవ్, చోక్సీలు చట్టాన్ని ఎదుర్కోక తప్పదు'